వానకాలం పంటల సాగు వివరాల నమోదు ప్రక్రియ రంగారెడ్డి జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. సమృద్ధిగా వానలు కురుస్తుండడంతో అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యా రు. జిల్లాలో సాగు విస్తీర్ణం 4.04 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటికే 1.54 లక్షల ఎకరాల్లో పం టల సాగు పూర్తైంది. జిల్లాలోని వ్యవసాయ శాఖకు చెందిన 113 మంది అధికారులు పల్లెబాట పట్టి గత పది రోజులుగా పంటల వివరాల నమోదును చేపడుతున్నారు. రైతులు ఏ సర్వేనంబర్‌లో ఏ పంటను ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారనే వివరాలను సేకరించి అప్పటికప్పుడే క్రాప్ బుకింగ్ యాప్‌లో నమోదు చేస్తున్నారు.
రంగారెడ్డి, జూలై 20 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుత వర్షాలు మెట్టపంటలకు ఊపిరి పోస్తున్నాయి. ఇప్పటికే సాగులో ఉన్న పత్తి, కందిపంటలకు తాజాగా కురుస్తున్న వర్షాలు ప్రాణం పోయగా.. చెరువులు, కుంటల్లోకి కూడా వరద నీరు వచ్చి చేరి రైతుల గుండెల నిండా భరోసానిస్తున్నాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం 4.04 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటికే 1.54 లక్షల ఎకరాల్లో పంటల సాగు ప్రారంభమైంది. అత్యధికంగా 1.05 లక్షల ఎకరాల్లో పత్తిని రైతులు సాగు చేశారు. ఇదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా వానకాలం సాగుకు అన్నదాతకు అండగా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. సీజన్‌కు ముందే రైతు బంధు సాయాన్ని అందించిన ప్రభుత్వం పంటల దిగుబడికి అనుగుణంగా మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. అందుకోసం పంటల వివరాల నమోదును చేపడుతున్నది. వ్యవసాయ శాఖ అధికారులు పల్లె బాట పట్టి రైతులు ఏ సర్వే నంబర్లో ఏ పంటను ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే వివరాలను సేకరిస్తున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారితోపాటు, సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, ఏఈవోలు కలిపి మొత్తం 113 మంది నిత్యం క్షేత్రస్థాయిలోనే ఉంటున్నారు. ఓ వైపు పంటల వివరాలను సేకరిస్తూనే.. పంటల సాగులో మెళకువలు, సూచనలను అందజేస్తున్నారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఆకాశం వైపు చూసే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు సంబురపడుతున్నారు.
అధికారుల పల్లె బాట
వానకాలం పంటల సాగు వివరాల నమోదు ప్రక్రియ పది రోజులుగా జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. ప్రస్తుతం రైతు బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జిల్లాలో కొనసాగుతుండగా.. ఈ విధులు నిర్వర్తిస్తూనే వ్యవసాయ శాఖ అధికారులు పంట లెక్కలను తీసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి వారం 980 సర్వే నంబర్లలో సాగైన పంటల వివరాలను నమోదు చేయాల్సి ఉండడంతో అధికారులు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అందుబాటులో ఉంటున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారితోపాటు, ఐదుగురు వ్యవసాయ సహాయ సంచాలకులు, 24 మంది మండల వ్యవసాయ శాఖ అధికారులు, 83 మంది ఏఈవోలు పంటల వివరాలను క్రాప్ బుకింగ్ యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. కిందిస్థాయి సిబ్బంది చేస్తున్న నమోదు ప్రక్రియను ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ పకడ్బందీగా సర్వే జరిగేలా చూస్తున్నారు. సర్వే నంబర్ల వారీగా పంటల సాగు వివరాలను సేకరిస్తుండడంతో సాగు లెక్క పక్కాగా ఉండనున్నది. ఏ పంట వల్ల ఎంత దిగుబడి వచ్చింది.. దిగుబడులకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు.. మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం వంటి చర్యలను ముందుగానే చేపట్టేందుకు ఆస్కారం కలుగుతుంది. మన జిల్లా, రాష్ట్ర అవసరాలకు సరిపడా పంటలను నిల్వ ఉంచుకుని ఏ పంటలను ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసుకోవచ్చునో అన్న ప్రణాళికను ముందే రూపొందించుకునే అవకాశం కూడా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
అత్యధికంగా పత్తి సాగు
జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురువనప్పటికీ వానకాలం పంటల సాగు ముమ్మరంగా సాగుతున్నది. జిల్లాలో సాగు విస్తీర్ణం 4.04 లక్షల ఎకరాలు కాగా.. ఈ సీజన్లో 3.90 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేసే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. ఇప్పటివరకు 1,54,627 ఎకరాల్లో రైతులు పలు రకాల పంటలను సాగు చేశారు. 8,328 ఎకరాల్లో వరి నాట్లు పూర్తికాగా.. 33,346 ఎకరాల్లో వరి నారు సిద్ధంగా ఉంది. అత్యధికంగా 1,05,879 ఎకరాల్లో రైతులు పత్తిని సాగు చేశారు.
రైతులకు సలహాలు, సూచనలు అందజేస్తూ..
క్షేత్రస్థాయి పర్యటన సందర్భంగా వ్యవసాయ అధికారులు పంటల సాగులో మెళకువలతోపాటు రైతులకు సలహాలు, సూచనలను అందజేస్తున్నారు. ఏయే పంటలను ఎప్పటివరకు సాగు చేయాలి?. వర్షాభావ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు.
రైతులకు అందుబాటులో ఉండి సూచనలిస్తున్నాం
సీజన్ ఆరంభంలో పంటల సాగు ఆశించిన స్థాయిలో లేనప్పటికీ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంటల సాగు ఊపందుకుంది. నిత్యం వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి సాగులో సలహాలు, సూచనలు ఇస్తున్నాం. సర్వే నంబర్ల ఆధారంగా పంటల వివరాల నమోదును చేపడుతున్నాం. యాప్‌లో నమోదు చేస్తున్న వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఆగస్టులో కూడా వరి పంటను సాగు చేసుకునే అవకాశం ఉన్నందున పంటల వివరాల నమోదు ప్రక్రియను ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
– గీతారెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి