కేశంపేట, సెప్టెంబర్ 18 : అరకొరగా పంపిణీ అవుతున్న యూరియాపై ఆగ్రహించిన రైతులు గురువారం కేశంపేట ఠాణా ఎదుట ధర్నాకు దిగారు. మండలంలోని కొత్తపేట పీఏసీఎస్ పరిధిలో పంపిణీ అవుతున్న యూరియా రైతులకు సరిపడా అందడంలేదు. విసుగు చెందిన మహిళా రైతులు, రైతులు కేశంపేట ఠాణా ఎదుట ఆందోళన చేపట్టి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొద్ది సేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.
యూరియా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయం చేయడం తగదని సూచించారు. ఆధార్‌కార్డుకు రెండు బస్తాల చొప్పున పంపి ణీ చేస్తున్నారని, 10 ఎకరాలున్న రైతుకు ఆ యూరియా ఎలా సరిపోతుందని ప్రశ్నించా రు. ఆధార్‌కార్డుతో సంబంధం లేకుండా పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా ఎరువును అందించాలని డిమాండ్ చేశారు.
ఎరువును అందించడం చేతగాకపోతే క్రాప్ హాలిడేను ప్రకటించాలన్నారు. రైతుల ఆందోళన విషయాన్ని తెలుసుకున్న పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్‌గౌడ్ హుటాహుటిన పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం ఠాణా ఆవరణలోనే పీఏసీఎస్ సిబ్బంది రైతులకు యూరియా టోకెన్లు అందజేశారు.
యూరియా కోసం బారులు
ఆమనగల్లు(మాడ్గుల) : మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రైతులు గురువారం ఉదయం నుంచే యూరియా కోసం బారులు తీరారు. గత నాలుగు రోజులుగా ఎరువుకోసం వచ్చి వెళ్తున్నా అందడం లేదని అన్నదాతలు మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు.