సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయ తలపెట్టిన ఫార్మా విలేజ్‌కు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్నారు. పచ్చని పంట పొలా ల్లో చిచ్చు పెట్టేలా..సర్కారు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై మండిపడుతు న్నారు. ప్రాణాలైనా ఇస్తాం.. కానీ, సాగు భూములను ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు.
– వికారాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ)
కొన్నేండ్లుగా వ్యవసాయాన్ని సాగు చేసుకుంటూ జీవిస్తున్న తమ పంట పొల్లాలను ఫార్మా కంపెనీలకు ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఏటా వరి పంటను సాగు చేస్తూ మేం తింటూ, పదిమందికి అన్నం పెట్టే పచ్చని సాగు భూముల్లో కాలుష్యం వెదజల్లే కంపెనీలను ఏర్పాటు చేయడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న మూడు గ్రామాల్లోనే కాకుండా వాటి చుట్టూ ఉన్న పలు గ్రామాల్లోనూ వ్యవసాయం బంద్ అవుతుందని..
తాగు, సాగు నీరు కలుషితమై ప్రజలు రోగాల బారిన పడే పరిస్థి తి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కడుపు కొట్టొదని.. కొడంగల్ నియోజకవర్గంలో సాగుకు అనుకూలంగా లేని భూములు చాలా ఉన్నాయని వాటిలో ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. సర్కారు ఫార్మా విలేజ్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ ఉద్యమిస్తూనే ఉంటామని పలు గ్రామాల ప్రజలు స్పష్టం చేస్తున్నారు.
ఫార్మా విలేజ్ వద్దే.. వద్దు..
దుద్యాల మండలంలోని హకీంపేట, పోలేపల్లి, లగచెర్ల గ్రామాల్లో ప్రభుత్వం ఫార్మా విలేజ్‌ను ఏర్పాటు చేయాలని భావించగా..అప్పటి నుంచి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉన్నది. ఈ మూడు గ్రామాల పరిధిలోని 1274.25 ఎకరాల ప్రభుత్వ, పట్టా భూములను సేకరించాలని సర్కారు నిర్ణయించగా అక్కడి రైతులు భగ్గుమంటున్నారు. కొన్నేండ్లుగా ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్నామని.. వాటి ని ఫార్మా కంపెనీలకు ఇస్తే ఎలా బతకాలని నిలదీస్తున్నారు. గత రెండు నెలలుగా ప్రతిరోజూ కడాతోపాటు దుద్యాల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ప్రజలు, రైతులు నిరసన తెలుపుతూనే ఉన్నారు. ప్రాణాలైనా ఇస్తాం.. కానీ.. భూములను ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు.
మేము వేసిన ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి.. ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డి మమ్మల్ని రోడ్డుపాలు చేస్తామంటే ఊరుకునేది లేదని, తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నా రు. భూములిస్తే మా బతుకులు రోడ్డున పడతాయని, ఊర్లు వదిలి వలసపోవాల్సి న దుస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసైన్డ్ భూముల కంటే అధికంగా మా పట్టా భూములకు పరిహారం ఇవ్వ డంతోపాటు ఫార్మా విలేజ్‌తో ఎలాంటి కా లుష్య సమస్యలు ఏర్పడవని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన విడుదల చేస్తేనే.. భూ ములిచ్చే విషయాన్ని ఆలోచిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే రైతులకు మద్దతుగా పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రోడ్లపై ధర్నాలు చేపట్టారు. తమ గోడును మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు దృష్టికి రైతులు తీసుకెళ్లారు.
703.65 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్…
ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం దుద్యాల మండలంలోని పోలేపల్లి గ్రామంలోని సర్వేనంబర్ 67లో 130 ఎకరాలు, హకీంపేటలోని సర్వేనంబర్ 252లో 366 ఎకరాలు, లగచెర్లలోని సర్వేనంబర్ 102లో 140 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. అయితే ఈ భూమి సరిపోకపోవడంతో ప్రభుత్వ, పట్టా భూములను కలిపి మూడు గ్రామాల పరిధిలో మొత్తం 1274.25 ఎకరాలను సేకరించాలని సర్కారు నిర్ణయించింది. హకీంపేటలో 505.37 ఎకరాలు, పోలేపల్లిలో 130 ఎకరాలు, లగచెర్లలో 643 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. ఇప్పటికే లగచెర్ల పరిధిలోని 632. 26 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల పట్టా భూములను సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
మేము.. ఏం పాపం చేశాం..
మేము.. ఏం పాపం చేశామని ప్రభుత్వం ఇంతటి దారుణానికి ఒడిగట్టుతున్నది. పచ్చటి పొలాల్లో చిచ్చుపెట్టేలా.. ఈ ప్రాంతంలో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ప్ర భుత్వం యత్నించడం బాధాకరం. రేవంత్‌రెడ్డి సీఎం అయితే ఈ ప్రాంతం అభివృ ద్ధి చెందుతుందని.. నీళ్లు వస్తాయని ఆశించాం. కానీ.. ప్రజా జీవనానికి భంగం కలిగించేలా ఫార్మా కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం తగదు.
– గోపాల్‌నాయక్, ఫార్మా బాధిత రైతు, పులిచర్లతండా, దుద్యాల
నోటి కూడు లాక్కొంటే.. చావే శరణ్యం..
వ్యవసాయంతోనే మా బతుకు, తిండి. అటువంటి భూములను లాక్కోవాలని ముఖ్యమంత్రే చూస్తుంటే ఇక మాకు చావే శరణ్యం. ప్రభుత్వం రైతులను ఇబ్బం ది పెట్టకుండా అందర్ని ఒకేసారి చంపేసి, మా మృతదేహాలపై కంపెనీలను ఏర్పాటు చేయండి. ఉన్న ఎకరం, రెండు ఎకరాల భూమి పోతే ఎట్లా బతకాలి. రేవంత్ ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావిస్తే.. మా జీవనాధారాన్ని లాక్కోవాలని చూడడం దారుణం.. కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండే. ఆయన్ను వదులుకొని చాలా తప్పు చేశాం..అనుభవిస్తున్నాం.
– లక్ష్మీబాయి, లగచెర్ల, దుద్యాల మండలం, కొడంగల్
మేం భూములివ్వం..
వ్యవసాయం పండుగలా సాగుతున్న ఈ ప్రాంతంలో ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించడం సరైంది కాదు. మేం భూములివ్వం. భూములు వదులుకొని ఎక్కడికెళ్లాలి. మాది, మా పిల్లల భవిష్యత్తు ఏమి కావాలి. వారసత్వం గా వచ్చిన భూములను ఎందుకు ఇస్తాం. ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. బీడు భూముల్లో ప్రజా శ్రేయస్సుకు తోడ్పడే కంపెనీలను ఏర్పాటు చేయాలి.
– కుమ్మరి శివకుమార్, ఫార్మా బాధిత రైతు, హకీంపేట, దుద్యాల
ఊరు బాగుంటేనే అందరూ బాగుంటారు..
ఊరు బాగుంటేనే ప్రజలందరూ బాగుంటారు. ఫార్మా కంపెనీల ఏర్పాటుతో ఊరు కాలుష్యమైతే మేము ఏ విధంగా బాగుంటామో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలి. గతంలో కేసీఆర్ సార్ రైతులు, ప్రజలకు ఏమి కావాలో ఆలోచించి అందించేవారు. కరోనా కాలంలోనూ వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. అలాంటి నాయకుడ్ని వదిలేసుకుని.. రైతులతోపాటు అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతున్న రేవంత్‌ను ఎన్నుకున్నందుకు ఇప్పుడు బాధ పడుతున్నాం. ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని పాలన చేపట్టాలి.. కానీ, స్వప్రయోజనాల కోసం ప్రజలను ఎరగా వేయడం ఎంతవరకు సమంజసం. భూములు ఇచ్చేదే లేదు. ఏమి జరిగినా అం దుకు సిద్ధమే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి.
– వెంకటేశ్, పోలేపల్లి, దుద్యాల మండలం, కొడంగల్