తుర్కయంజాల్, మార్చి 12 : తొర్రూర్ డివిజన్ పరిధిలోని కొహెడ రెవెన్యూ సర్వే నంబర్ 167/1లో ఇంటిగ్రేటేడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఏర్పాటును నిరసిస్తూ రైతు బుడ్డ ఆగమయ్య చేపడుతున్న ఆందోళన మూడవ రోజు కోనసాగింది. కొహెడకు చెందిన రైతు బుడ్డ ఆగమయ్యకు చెందిన సుమారు 4 ఎకరాల భూమిలో ఇంటిగ్రేటేడ్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ ఏర్పాటుకు ప్రభుత్వం గత 100 సంవత్సరాలుగా ఆగమయ్య కుటుంబ సభ్యులు వ్యవసాయం చేస్తూన్న భూమిని ఆధినంలోకి తీసుకున్నారు. అయితే తనకు నష్టపరిహరంతో పాటుగా ఎకరాలకు 500 గజాల స్థలాన్ని కేటాయించాలని కోరుతూ రైతు ఆగమయ్య గత రెండు రోజులుగా భూమి వద్ద కొహెడ జేఏసీ నాయకులతో కలిసి ఆందోళన చేపడుతున్నారు.
గురువారం పలు పార్టీలకు చెందిన నాయకులు ఆగమయ్యకు మద్దతు తెలిపారు. మాజీ పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు నష్టపరిహరం చెల్లించాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తామని అన్నారు. అనంతరం సీపీఎం పార్టీ నాయకులు డి.కిషన్ ఆధ్వర్యంలో రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కొహెడ జేఏసీ నాయకులు కందాళ బలదేవరెడ్డి, నాయకులు నర్సింహ్మరెడ్డి, రాంరెడ్డి, బచ్చిగళ్ల రమేష్, బుడ్డ విజయ్ తదితరులు పాల్గొన్నారు.