వికారాబాద్, ఆగస్టు 15, (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని, పార్టీ మారుతానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, కొందరు మీడియా సంస్థలు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. పార్టీ మారుతారని వస్తున్న వార్తలను ఖండిస్తూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ గత పది రోజులుగా వివిధ టీవీ చానెళ్లలో, పత్రికల్లో, సోషల్ మీడియాలో తనపై పుకార్లు షికార్లు వస్తున్నాయని, ఇతర పార్టీలకు చెందిన ఈ మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. అంతేకాకుండా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ఇలాంటి బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారని, తాండూరు ప్రజలెవరూ నమ్మొద్దని, పార్టీ మారుతారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పైలట్ రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం నేను వేసిన ప్లాన్ అని, కొంత మంది మాజీ ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి వెళ్తున్నారని ఓ టీవీ చానెల్లో ప్రచారం చేస్తుండడం హాస్యాస్పదమన్నారు.
గతంలో బీజేపీ వాళ్లు రూ.వేల కోట్ల కాంట్రాక్టులు, ఉన్నత పదవులు నాకు ఆశచూపించినా, నా తాండూరు ప్రజలకు అన్యాయం చేయకూడదు, తెలంగాణకు అన్యా యం చేయకూడదని మీ బిడ్డ రోహిత్ రెడ్డి సాహసం చేసిండని పైలట్ గుర్తు చేశారు. తాండూరు నియోజకర్గ ప్రజలు, అభివృద్ధి ముఖ్యమని ఆనాడు బీజేపీకి చెందిన వాళ్లను ప్రపంచానికి పట్టించామన్నారు. ఇటువంటి ధైర్యసాహసాలను చేసిన తాండూరు బిడ్డ పార్టీ మారే ప్రసక్తే లేదని, కొన ఊపిరి వరకు తాండూర్ అభివృద్ధే లక్ష్యమని, బీఆర్ఎస్ పార్టీలోనే సైనికుడిగా పనిచేస్తానని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేయొద్దని ఇతర పార్టీలకు తొత్తులకు మారిన మీడియా సంస్థలను పైలట్ రోహిత్ రెడ్డి హెచ్చరించారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపర్చే అభ్యర్థులను గెలిపించుకుందామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే విజయమని రోహిత్ రెడ్డి తెలిపారు.