వికారాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. గురువారం తెల్లవారుజాము నుంచి 48 గంటలపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అతిభారీ వర్షాల దృష్ట్యా జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది.
జిల్లాలో 150-200 మి.మీ మేర వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగకుండా అవసరమైన చర్యలను జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలో ప్రధానమైన కాగ్నా, మూసీ, ఈసీ వాగులతోపాటు మిగతా వాగుల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా పోలీసుల పహారా ఉండేలా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో యాలాల, తాండూరు, బొంరాస్‌పేట్ మండలాల్లో కాగ్నా వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావడంతో ఎవరూ వాగులు దాటవద్దని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, మున్సిపల్ అధికారులు, ఉద్యోగులకు జిల్లా ఉన్నతాధికారులు సెలవులు రద్దు చేశారు. ఏదైనా అనుకొని ప్రమాదం జరిగినప్పుడు సహాయం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు.
సహాయం కోసం 08416-235291, 7995061192లను సంప్రదించాలని జిల్లా యంత్రాంగం సూచించింది. మరోవైపు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో పంటలకు నష్టం వాటిల్లుతున్నది. మొన్నటి వరకు వర్షాలు లేకపోవడంతో ఎండుముఖం పట్టిన పంటలతో ఆందోళన చెందిన రైతులకు గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నీట మునిగిన పంటలతో రైతులు దిగులు చెందుతున్నారు.
తాండూరు, కొడంగల్, పరిగి, బంట్వారం, మర్పల్లి, ధారూరు, మోమిన్‌పేట్ మండలాల్లో భారీ వర్షాలు నమోదు కావడంతో పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు నష్టం జరిగింది. జిల్లావ్యాప్తంగా సుమారు 200 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు నష్టం జరిగినట్లు సంబంధిత అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వర్షాలతో జిల్లాలో పలు చోట్లు ఇండ్లు కూలిపోవడం, పశువులు మృత్యువాత పడడంలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.
మరో రెండు రోజులపాటు వర్షాలు
రంగారెడ్డి, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు రంగారెడ్డిజిల్లాలో రెడ్ అలర్ట్‌ను ప్రకటించారు. రానున్న 48 గంటల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
నగర శివారుల్లో విస్తరించి ఉన్న రంగారెడ్డిజిల్లాలోని పలు మండలాలకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారులను నియమించారు. ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రంగారెడ్డిజిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, మున్సిపల్ అధికారులంతా తమ సెలవులను రద్దు చేసుకుని అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. జిల్లా ఎగువ ప్రాంతంలో ఉన్న వికారాబాద్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల హిమాయత్‌సాగర్‌కు వరద ప్రవాహం పెరుగుతున్నది. మంగళవారం కురిసిన వర్షంతో ఫిరంగి నాలా ద్వారా ఇబ్రహీంపట్నం పెద్దచెరువులోకి నీరు చేరుతున్నది. పులిందర్వాగుపై నిర్మించిన పలు చెక్‌డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి.
అత్యధిక వర్షపాతం నమోదు
జిల్లావ్యాప్తంగా బుధవారం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు ముసురు కురిసింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నంలో 21.2 మి.మీ., మంచాలలో 23.1, యాచారంలో 30, కందుకూరులో 13, బాలాపూర్‌లో 10 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇండ్లలో నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
హిమాయత్‌సాగర్ మరో గేటు తెరిచే అవకాశాలు
జిల్లా పరిధితో పాటు ఎగువనున్న వికారాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో కురుస్తున్న వర్షాలతో హిమాయత్‌సాగర్‌కు వరద ప్రభావం పెరిగింది. ఇప్పటికే హిమాయత్‌సాగర్ నాలుగు గేట్లను తెరిచి అధికారులు నీటిని కిందకు వదులుతున్నారు. వరద ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో సాయంత్రానికి మరో గేటు తెరవాలని అధికారులు భావిస్తున్నారు.