బొంరాస్‌పేట, ఫిబ్రవరి 19 : వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల పరిశీలన సోమవారం నుంచి ప్రారంభమైంది. మార్కుల పరిశీలనకు డీఈవో జిల్లాలోని వివిధ పాఠశాలల జీహెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లతో 17 బృందాలను ఏర్పాటు చేశారు. వీరు తమకు కేటాయించిన పాఠశాలలకు వెళ్లి పదో తరగతి విద్యార్థులకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు కేటాయించిన ఇంటర్నల్ మార్కులను పరిశీలిస్తున్నారు.
పదోతరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు 80 మార్కులు, ఇప్పటికే నిర్వహించిన ఎఫ్ఏ-1, ఎఫ్ఏ-2 పరీక్షలు, విద్యార్థులకు ఇచ్చిన ప్రాజెక్టుల వర్క్‌లు, నోటు పుస్తకాల్లో విద్యార్థుల చేతిరాతను బట్టి ఉపాధ్యాయులు 20 ఇంటర్నల్ మార్కులు కేటాయిస్తారు. ఈ మార్కుల కేటాయింపు సక్రమంగానే జరిగిందా లేదా అనే విషయాలను ప్రత్యేక బృందాలు పాఠశాలలకు వెళ్లి తనిఖీ చేస్తున్నాయి
వచ్చే నెలా 18 నుంచి జరిగే ఎస్సెస్సీ వార్షిక పరీక్షలకు వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 13,456 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అదేవిధంగా ఈ నెల 22 నుంచి ప్రీ-ఫైనల్ పరీక్షలను నిర్వహించనున్నారు. వీటికి ముందే అంతర్గత మార్కుల పరిశీలన పూర్తి చేయాలన్న ఉద్దేశంతో జిల్లాలో 17 తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. వీరంతా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల అంతర్గత మార్కులను పరిశీలిస్తారు.
బొంరాస్‌పేట జీహెచ్ఎం హరిలాల్ నేతృత్వంలో నామ్యానాయక్, శివరాజ్, అభయకుమార్తో ఏర్పాటు చేసిన బృందం చౌదర్పల్లి, హకీంపేట, కేజీబీవీ పాఠశాలలను, దుద్యాల హెచ్ఎం నెహ్రూచౌహాన్ నేతృత్వంలో శ్రీకాంత్, మల్లప్పలతో ఏర్పాటు చేసిన బృందం రేగడిమైలారం, బొట్లవానితండా ఆశ్రమ పాఠశాల, చిల్ముల్మైలారం మైనార్టీ గురుకుల పాఠశాలలకు, చౌదర్పల్లి హెచ్ఎం శ్రీహరిరెడ్డి నేతృత్వంలో రవీందర్, శివకుమార్‌లతో ఏర్పాటు చేసిన తనిఖీ బృందం బొంరాస్‌పేట, దుద్యాల, కుదురుమల్ల ఉన్నత పాఠశాలలను సందర్శించి ఇంటర్నల్ మార్కులను పరిశీలిస్తారు.