Pending Bills | కడ్తాల్, మార్చి 22 : మాజీ సర్పంచ్‌లకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మినర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో మాజీ సర్పంచ్‌లతో కలిసి ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఐదేండ్ల పదవి కాలంలో ప్రభుత్వం అందించిన సూచనలు, ఆదేశాల మేరకు గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు, మన ఊరు-మన బడి, వైకుంఠదామం, రైతు వేదిక, మిషన్ భగీరథ, వీధిలైట్ల నిర్వహణ, పల్లెప్రకృతి వనం, వీధిలైట్ల నిర్వహణలాంటి అభివృద్ధి చేపట్టాని పేర్కొన్నారు.
తెలంగాణ గ్రామాల్లో జరిగిన అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఉత్తమ గ్రామ పంచాయతీలుగా అవార్డులను అందించిన్నట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించకపోవడంతో మాజీ సర్పంచ్‌లు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలో ఉన్న బిల్లులు రాక ఒక పక్క మాజీ సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మరో పక్క ప్రపంచ అందాల పోటీలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉన్నదని విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ సర్పంచ్‌లకు బిల్లులు అందిస్తామని ప్రగ్భలాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం… అధికారంలోకి రాగానే హామీని విస్మరించి కాలయాపన చేస్తుందని ఆరోపించారు. పదిహేను నెలలుగా గ్రామ పంచాయతీలకు బకాయి బిల్లులు చెల్లించకుండా ఉన్న ప్రభుత్వం, అందాల పోటీలు నిర్వహణకు నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయని ప్రశ్నించారు. అభివృద్ధి పనుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక మాజీ సర్పంచ్‌లు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న బిల్లులు విడుదల చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, మాజీ సర్పంచ్‌లు హరిచంద్‌నాయక్, సులోచనసాయిలు, నాయకులు వీరయ్య, రామకృష్ణ, నర్సింహా, లాయక్‌అలీ, మహేశ్, రవి, నాగార్జున, కుమార్‌గౌడ్, సురేశ్, అంజి, రాజు, జంగయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.