Jaipal Yadav | కడ్తాల్, మార్చి 13 : కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రజాస్వామ్యానికి ఖూనీ జరుగుతున్నదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మండిపడ్డారు. తలకొండపల్లి మండల పరిధిలోని గట్టుఇప్పలపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని, కొన్ని రోజులుగా మండల సాధన సమితి నాయకులు గ్రామంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.
గ్రామస్థులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో, గురువారం అసెంబ్లీ ముట్టడికి మండల సాధన సమితి నాయకులు పిలుపునిచ్చారు. అసెంబ్లీకి ముట్టడికి పిలుపునిచ్చిన జేఏసీ నాయకులతోపాటు, వివిధ పార్టీలకు చెందిన నాయకులను… గురువారం తెల్లవారుజామున పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి కడ్తాల్, తలకొండపల్లి, ఆమనగల్లు పోలీస్స్టేషన్లకు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఆయా పోలీస్‌స్టేషన్‌లో జేఏసీ నాయకులను పరామర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ముసుగులో రాక్షస పాలనను సాగిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. మండల సాధనకు శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపేందుకు హైదరాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధమైన నాయకులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన సాగుతుందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం గట్టుఇప్పలపల్లి గ్రామాన్ని వెంటనే మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని రఘుపతిపేట్, ఇర్విన్, వెల్జాల్ గ్రామాలను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేయాలన్నారు. కల్వకుర్తి ప్రాంత ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సీఎం రేవంత్‌రెడ్డికి తగదన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్, అనురాధపత్యానాయక్, మాజీ సర్పంచ్‌లు హరిచంద్‌నాయక్, సాయిలు, శ్రీనివాస్‌నాయక్, మాజీ ఎంపీటీసీ రమేశ్‌నాయక్, మాజీ ఉప సర్పంచ్ పాండునాయక్, రైతు సమితి మాజీ అధ్యక్షుడు నర్సంహా, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సీహెచ్ మహేశ్, నాయకులు జగన్యాదవ్, టీకులాల్నాయక్, అంజి, శ్రీను, శ్రీకాంత్, ప్రసాద్, సక్రు, మల్లేశ్, పవన్, జగన్, తదితరులు పాల్గొన్నారు.