షాద్‌నగర్‌టౌన్, నవంబర్ 29: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ తుదిఘట్టానికి చేరుకుంది. కట్టుదిట్టమైన బందోబస్తుతో ఎన్నికలను నిర్వహించేందుకు సంబంధిత అధికారులు, పోలీసులు సిద్ధమయ్యారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాటు పూర్తి చేశామని షాద్‌నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటమాధవరావు బుధవారం తెలిపారు. ఎన్నికల పరిశీలకులు చంద్రకాంత్ కేడాంగే ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. 1150మంది సిబ్బందితో పాటు వందల సంఖ్యలో పోలీస్ సిబ్బంది ఎన్నికల నిర్వహణలో భాగస్వాములవుతున్నారు. మొత్తం 255 కేంద్రాల వద్ద శాఖపరమైన అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. షాద్‌నగర్ మున్సిపాలిటీలోని మినీ స్టేడియంలో 255 కేంద్రాలకు సంబంధించిన ఈవీఎం, వీవీప్యాట్, ఇతర పరికరాలను ఎన్నికల సిబ్బందికి సమావేశం నిర్వహించి అందజేశారు.
మినీ స్టేడియం ప్రాంగణంలో పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పేర్లను, రూట్లను బూత్ అధికారులకు వివరించారు. పోలింగ్ కేంద్రాలకు 200మీటర్ల వరకు రాజకీయ నాయకులు ఎలాంటి ప్రచారం నిర్వహించవద్దని సూచించారు. ఉదయం 7గంటల నుంచి నిర్వహించే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తాసీల్దార్ పార్థసారధి, ఎంఈఓ శంకర్‌రాథోడ్, ఏసీపీ రంగస్వామి, పట్టణ సీఐ ప్రతాప్‌లింగం, వివిధ మండలాల ఎంపీడీవోలు, వివిధశాఖల అధికారులు, వైద్యాధికారులు, పోలీసులు పాల్గొన్నారు.
255 పోలింగ్ కేంద్రాలు, 2,36,338 మంది ఓటర్లు
షాద్‌నగర్ నియోజకవర్గంలో 255పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 2,36,338మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,19,045మంది, స్త్రీలు 1,17,278మంది, ట్రాన్‌జెండర్స్ 15మంది ఉన్నారు.
నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని షాద్‌నగర్ పోలీసులు తెలిపారు. అన్ని ప్రాంతాల్లో 144సెక్షన్ అమలులో ఉంటుందని, శాంతిభద్రతలకు, ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలిగించినా చర్యలు ఉంటాయన్నారు. పోలింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఎలాంటి వాహనాలను నిలుపరాదని, గుంపులుగా జనాలు ఉండరాదని చెప్పారు. నియోజకవర్గ పరిధిలో ఒక డీసీపీ, అడిషనల్ డీసీపీ, ఐదుగురు ఏసీపీలు, 11మంది సీఐలు, 7మంది ఎస్‌లు, పారామిలిటరీ 140 మందితో పాటు 420మంది పోలీస్ సిబ్బంది వీధులు నిర్వహిస్తున్నారని వివరించారు.
సహాయకులుగా ఎన్ఎస్ఎస్ వలంటీర్లు
షాద్‌నగర్ అసెంబ్లీ ఎన్నికల సహాయకులుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొననున్నట్లు ఎన్ఎస్ఎస్ యూనిట్ ఫ్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎన్. రవీందర్‌రెడ్డి తెలిపారు. సుమారు 20మంది వలంటీర్లు ఎలక్షన్ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్ విభాగంలో సహాయకులుగా విధులు నిర్వహించనున్నారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను రిటర్నింగ్ అధికారి వెంకటమాధవరావు, తాసిల్దార్ పార్థసారధి అభినందించారు.
మొయినాబాద్ : మండలంలో 28 గ్రామ పంచాయతీలు, 8 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. మండలంలో 65 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కూ రెండు వెబ్ కాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు. 6 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మండలంలో 5 రూట్లు ఏర్పాటు చేశారు. 5 రూట్లకు ఒక సీఐ, ఒక ఎస్ఐ, 13 మంది కానిస్టేబుల్స్, 6 మంది ఆర్మీ జవాన్లు విధులు నిర్వహిస్తారు. 65 పోలింగ్ స్టేషన్ల వద్ద మొత్తం 70 మంది పోలీస్ సిబ్బంది, 30 మంది ఆర్మీ జవాన్లు విధులు నిర్వహిస్తారు. సమస్యాత్మక గ్రామాలైన పెద్దమంగళారం, చిలుకూరు, హిమాయత్‌నగర్, శ్రీరాంనగర్, బాకారం గ్రామాల్లో పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు.
నందిగామ : అసెంబ్లీ ఎన్నికలకు నందిగామ మండల వ్యాప్తంగా ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నందిగామ మండలంలో రెండు రూట్లుగా ఏర్పాటు చేసి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నందిగామలో 6, మేకగూడ 2, నర్సప్పగూడ 2, రంగపూర్ 3, చేగూరు 6, వీర్లపల్లి 3, మామిడిపల్లి 2, మాజీద్మామిడిపల్లి 2, ఈదులపల్లి 1 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. మండలంలో మొత్తం 39,283 మంది ఓటర్లు ఉన్నారు. 42 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది, 50 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సీఐ ఎన్.సురేశ్ తెలిపారు.