కడ్తాల్, మే 10 : యాసంగిలో పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మంగళవారం కడ్తాల్ మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, ఏంఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. అన్నదాతలు పండించిన పంటలను చివరి గింజ వరకు ప్రభుత్వం కొనేందుకు రాష్ట్రంలో ఆరు వేల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ధాన్యంకి సంబంధించిన డబ్బులను వారంరోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ధాన్యానికి సరిపడా గన్నీ బ్యాగులను ప్రభుత్వం అందజేస్తుందన్నారు.
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందని, ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరానికి జాతీయ హోదాన్నిచ్చి, తెలంగాణలోని కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. ఒక వైపు సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరందించడానికి ప్రాజెక్ట్‌లను నిర్మిస్తుంటే, మరో వైపు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని మద్రాస్‌లోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేసింది కాంగ్రెస్, బీజేపీ నాయకులేనని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి తీరని అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను అన్ని విధాల ఆదుకోవడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, జూన్ నెలలో రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులను జమ చేస్తామని ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.