పల్లెలను మంచుతెర కమ్మేసింది. శనివారం తెల్లవారుజాము 4గంటల నుంచే దట్టమైన పొగమంచు కురువడంతో ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులు సైతం కనబడనంతగా మంచు కమ్ముకోవడంతో వాహనదారులు లైట్లు వేసుకొని రాకపోకలు సాగించారు. పొలాల వద్దకు వెళ్లే రైతులు టార్చిలైట్లు తీసుకెళ్లారు. కొన్ని గ్రామాల్లో ఉదయం 8గంటలు దాటినా మంచు వీడలేదు.
-న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
వికారాబాద్‌లోని అనంతగిరి అడవిని కమ్మేసిన పొగ మంచు
పొద్దుగూకితే చలిదెబ్బకి సతమతం.. మళ్లీ వేకువజాము నుంచే పొగమంచుకు ఎముకలు కొరికే చలి.. కనుచూపు మేరలో నేలనంతా మంచుదుప్పటి కప్పేస్తున్నది. ఉదయం 8 గంటల వరకు మంచుతెర తొలగడం లేదు. శనివారం రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి, షాబాద్ మండలాలు, వికారాబాద్‌లో విపరీతంగా మంచుకురిసింది. కమ్ముకున్న మంచు కారణంగా రహదారులు కనిపించక వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించారు. ముంబై-బెంగూళూరు లింకు జాతీయ రహదారిపై వాహనాలు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వచ్చింది.
– శంకర్పల్లి/షాబాద్, డిసెంబర్ 3