వికారాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : గత యాసంగిలో సన్న రకం ధాన్యాన్ని సేకరించిన ప్రభు త్వం నాలుగు నెలలు గడిచినా ఇప్పటికీ బోనస్ డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సన్నాలు సాగు చేసిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 ఇస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..ఆ హామీని తుంగలో తొక్కింది. కేవలం సేకరించిన దొడ్డు వడ్లకే చెల్లింపులు పూర్తి చేసి చేతులు దులుపుకోవడంతో జిల్లా రైతాంగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది.
సన్నరకం వడ్లకు ప్రైవేట్ మార్కెట్లో అధిక ధర ఉన్నా బోనస్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వడ్లను విక్రయిస్తే ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తూ ఇబ్బందులు పెట్టడం తగదని అన్నదాతలు పేర్కొంటున్నారు. కాగా, వానకాలం ధాన్యం సేకరణకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నా రు. కాగా, జిల్లాలో గత యాసంగిలో 8,921 మెట్రిక్ టన్నుల సన్న రకాన్ని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయగా.. అందుకు సం బంధించి రూ.4.46 కోట్లను బోనస్‌గా రైతులను చెల్లించాల్సి ఉన్నది. మరోవైపు బోనస్ డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారని రైతులను కాం గ్రెస్ ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నా ప్రభు త్వం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం.
సీఎంఆర్ ఇవ్వడంలో తీవ్ర జాప్యం..
జిల్లాలో సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. పౌరసరఫరాల శాఖ రైస్‌మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ కింద ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వకుండా ఆ రైస్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ అక్రమంగా ఆర్జిస్తున్నారు. మిల్లర్లపై సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సర్కార్కే టోకరా పెడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి బియ్యం రూపంలో పౌరసరఫరాల శాఖకు విధించిన నిర్ణీత గడువులోగా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఒకరిద్దరు మిల్లర్లు మినహా మిగిలిన వా రందరూ పౌరసరఫరాల శాఖ మిల్లింగ్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించి ఎలాంటి అనుమానం రాకుండా విడతల వారీగా పౌరసరఫరాల శాఖకు నాసిరకం బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
జిల్లాలో గతేడాది వానకాలానికి సంబంధించి మిల్లర్ల నుంచి రావాల్సిన సీఎంఆర్ 80 శాతం పూర్తికాగా, మరో 20 శాతం రావాల్సి ఉన్నది. అలాగే, యాసంగికి సంబంధించి 40 శాతం మాత్రమే సీఎంఆర్ బియ్యం రాగా, మరో 60 శాతం బియ్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉన్నది. కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 85,678 మెట్రిక్ టన్నుల రైస్‌ను తిరిగివ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 39,000 మెట్రిక్ టన్నుల వరకే మిల్లర్లు అందజేశారు.