వికారాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో పత్తి రైతుకు ఇబ్బందులు తప్పడం లేదు. పత్తిని విక్రయించే సమయంలో ఏదో ఒక కొర్రీ పెట్టి అన్న దాతను వేధిస్తున్న సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) విక్రయించిన తర్వాతా డబ్బులు చెల్లించడంలోనూ మనోవేదనకు గురిచేస్తున్నది. ఐదారు రోజేల్లోనే పత్తిని అమ్మిన రైతులకు చెల్లింపులు పూర్తి చేస్తామంటూ సీసీఐ అధికారులు చెబుతున్నా.. నెల రోజులైనా పత్తిని విక్రయించిన రైతులకు డబ్బులు చేతికి అందని దుస్థితి నెలకొన్నది. సేకరించిన వెంటనే బిల్లులు చేయాల్సిన సీసీఐ కొనుగోలు కేంద్రాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రైతులకు చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
అంతేకాకుండా కొందరు రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ కాకపోవడం, ఆధార్ మ్యాపింగ్ లేపోవడం తదితర కారణాలతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. చాలామంది రైతులు డబ్బు ల కోసం సీసీఐ కేంద్రాల చుట్టూ పడిగాపులు గాస్తున్న పరిస్థితి. దీంతో పలువురు రైతులు తక్కువ ధర వచ్చినా మధ్యదళారులకు విక్రయించి నష్టపోతున్నారు. మరోవైపు జిల్లాలోని 26,607 మంది రైతుల నుంచి సీసీఐ ఇప్పటివరకు రూ.240 కోట్ల విలువైన పత్తిని సేకరించి.. ఇప్పటివరకు రూ. 120 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయగా, మరో రూ.120 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. కాగా, జిల్లాలో ఈ ఏడాది 2.54 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేయగా.. 2 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.
జిల్లాలో పత్తి రైతుకు ప్రతి ఏటా ఏదో రకంగా నష్టా లు తప్పడం లేదు. తొలుత సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం కావడంతో వర్షాలకు పత్తి నాని రంగు మారిన రైతులు తేమ పేరిట దోపిడీకి గురయ్యారు. పత్తిలో తేమ 8-12 శాతం కం టే ఎక్కువ ఉంటే.. ఆ శాతాన్ని బట్టి మద్దతు ధరను తగ్గించి రైతుల నుంచి కొంటున్నారు. జిల్లాలోని పలు జిన్నింగ్ మిల్లుల్లో రైతులు తీసుకొచ్చే పత్తిలో తేమ శాతం సాధారణ స్థాయిలో ఉన్నా తేమ శాతం ఎక్కువగా ఉందంటూ సాకులు చెబుతూ రైతులను మో సం చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. సీసీఐ నిబంధనల ప్రకారం.. పత్తిలో తేమ 8-12 శాతం వరకు ఉంటే క్వింటా పత్తికి మద్దతు ధర రూ. 8110గా నిర్ణయించగా, అదే 12 శాతానికిపైగా తేమ ఉంటే రూ.100 నుంచి రూ.300 వరకు తగ్గించి కొంటున్నారని అన్నదాతలు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు.
రైతులు తీసుకొచ్చే పత్తిలో తేమ 12 శాతంలోపు ఉన్నా 12 శాతం కంటే ఎక్కువ తేమ శాతం ఉందంటూ చూపెడుతూ రూ.7800 వరకు కొంటూ మోసం చేస్తున్నారని.. సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు కుమ్మక్కై పత్తి రైతులకు నష్టం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని అమ్మాలంటే తప్పనిసరిగా రైతులు స్లాట్ బుక్ చేసుకోవాలనే నిబంధన పెట్టడంతో పత్తిని ఏరి ఇంట్లో పెట్టుకున్న రైతులు యాప్లో స్లాట్ బుక్ చేసుకోవడం వంటి కొర్రీలతో ఇబ్బందులు పడుతూ బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విక్రయిస్తూ నష్టపోతున్నారు.
అదేవిధంగా గతేడాది ఎకరాకు 12 క్వింటాళ్ల నిబంధన ఉండగా, ఈ ఏడాది ఎకరాకు 7 క్వింటాళ్లకు ప్రభుత్వం కుదించింది. సాధారణంగా ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వచ్చే పరిస్థితులున్నాయి. సీసీఐ పెట్టిన ఈ కొర్రీలతో బహిరంగ మార్కెట్కు తప్పని పరిస్థితుల్లో విక్రయించాల్సి వస్తుంద నే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే బహిరంగ మా ర్కెట్లో రూ.6500ల నుంచి రూ.7 వేల వరకు మా త్రమే ఉండడంతో రైతులు సీసీఐ పెట్టే నిబంధనలకు ఇబ్బందులు పడుతూ బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విక్రయిస్తూ నష్టపోతున్నారు.