Parigi | పరిగి, మే 15 : పరిగి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగడ్డపల్లికి రోడ్డుకు ఎప్పుడు మోక్షం కలుగుతుంది..? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రామపంచాయతీగా కొనసాగినప్పటి నుంచి పరిగి పరిధిలో గల ఎర్రగడ్డపల్లి, సుల్తాన్నగర్లకు చాలా ఏళ్ల క్రితం రోడ్డు నిర్మాణం చేపట్టారు. రోడ్డుపై ఎర్రగడ్డపల్లి, సుల్తాన్‌నగర్, నారాయణపూర్, లక్షీదేవిపల్లి గ్రామాల వారు రాకపోకలు సాగించేందుకు ఇదే రహదారి అనువైనది. అనేక ఏళ్ల క్రితం నిర్మాణం చేపట్టిన రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేయబడిన రూ.25కోట్లతో మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ది పనులకు సంబంధించి శంకుస్థాపన సైతం చేపట్టారు.
ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావచ్చినా ఇప్పటికీ రోడ్డు నిర్మాణానికి మోక్షం లభించడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరిగి నుంచి ఎర్రగడ్డపల్లి వరకు సుమారు కిలోమీటరుకు పైగా దూరం రోడ్డును డబుల్ రోడ్డుగా వేయాలని ప్రతిపాదించారు. ఈ మేరకు నిధుల కేటాయింపు జరిగింది. కానీ టెండర్లు పిలిచే లోపు ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు తాము తెచ్చామని అధికార పార్టీ నాయకులు చెప్పుకోవడం తప్ప మరోటి లేకుండాపోయింది. కనీసం వచ్చిన నిధుల ఖర్చుకు సంబంధించి టెండర్లు సైతం పూర్తి చేయలేని దుస్థితి నెలకొంది. ఇటీవల టెండర్లు పిలిచినా, ఏదో తప్పిదం జరిగిందంటూ మళ్లీ టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవనున్నట్లు సమాచారం.
పరిగి పట్టణం నుంచి సుమారు కిలోమీటరుకు పైగానే దూరం ఉన్నటువంటి ఎర్రగడ్డపల్లి రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షాకాలం అటుంచి మండు వేసవిలో సైతం ఆ చుట్టుపక్కల ఇళ్ల మురికినీరు ఈ రోడ్డుపై ప్రవహించడం గమనార్హం. అనునిత్యం రద్దీగా ఉండే ఈ రహదారికి ఇరువైపుల ప్రత్యేకంగా మురికికాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో పలుచోట్ల రోడ్డు పక్కనే మురికినీరు ప్రవహిస్తుంది. కొన్నిచోట్ల గుంతలు మరింత పెద్దగా ఏర్పడ్డాయి. ఈ గుంతలలో నిలిచిన నీటిలో నుంచే వాహనాల రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోడ్డు నిర్మాణంపై పలుమార్లు ఎమ్మెల్యేను అడిగితే త్వరలోనే రోడ్డు వేస్తామనే సమాధానం వస్తుంది తప్ప రోడ్డు నిర్మాణం జరగడం లేదని గ్రామస్తులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో డబుల్ రోడ్డుగా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించగా ప్రస్తుతం సింగిల్‌రోడ్డుగానే వేయనున్నట్లు సమాచారం. ఈ విషయం సైతం క్లారిటీ లేకపోవడం, అధికారులెవరు నోరు మెదకపోవడం గమనార్హం. తాము ఎన్ని రోజులు ఈ గుంతల రోడ్డుపై నుంచి రాకపోకలు సాగించాలని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా వెంటనే టెండర్లు పూర్తి చేసి ఎర్రగడ్డపల్లి, సుల్తాన్‌నగర్ వరకు రోడ్డు నిర్మాణంతోపాటు ఇరువైపుల మురికికాలువల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. పరిగి పట్టణం విస్తరించి రెండుమూడు సంవత్సరాలలోనే ఎర్రగడ్డపల్లి వరకు ఇళ్ల నిర్మాణాలు జరగనున్నందున ఈ రోడ్డుకు ప్రాధాన్యత ఇచ్చి డబుల్ రోడ్డు వేయాలని పేర్కొంటున్నారు.