ఇబ్రహీంపట్నం, ఆగస్టు 5 : పరిసరాల పరిశుభ్రత పచ్చదనాన్ని పెంపొందించడం ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మున్సిపల్ ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం విద్యార్థులతో కలిసి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ‘స్వచ్ఛదనం-పచ్చదనం’పై విద్యార్థులు, అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా లేకపోతే డెంగీ, చికున్‌గున్యా, మలేరియా వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నదని తెలిపారు. సగటున ప్రతి మనిషి నిత్యం రెండు వందల నుంచి మూడు వందల గ్రాముల చెత్తను తయారు చేస్తున్నారని అన్నారు.
పరిసరాల పరిశుభ్రతలో శానిటేషన్ సిబ్బంది కష్టం వెలకట్టలేనిదన్నారు. పరిశుభ్రతతో పాటు పచ్చదనం కూడా ఎంతో అవసరమన్నారు. పచ్చదనం కోసం మొక్కలు నాటాల్సిన అవసరం ఉన్నదన్నారు. చెట్లు మనకు ఆక్సిజన్ అందిస్తున్నాయన్నారు. తెలంగాణాలో 33 శాతం అడవులు ఉండాల్సిన అవసరం ఉన్నా ప్రస్తుతం 24శాతం మాత్రమే అడవులు ఉన్నాయని పేర్కొన్నారు.
మున్సిపాలిటీలో ప్రత్యేక కార్యాచరణ..
మున్సిపాలిటీ పరిధిలో పరిసరాల పరిశుభ్రతకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి తెలిపారు. ప్రతివార్డులోనూ పరిసరాల పరిశుభ్రతతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దార్ సునీత, మున్సిపల్ కమిషనర్ రవీంద్రసాగర్, కౌన్సిలర్లు శ్వేత, ఆకుల మమత, ఆకుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.