Indiramma Atmiya Bharosa | ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హుల ఎంపిక ప్రహసనంగా మారింది. జిల్లాలో లక్షలాది మంది అర్హులున్నా కేవలం 14,284 మందే అర్హులం టూ అధికారులు జాబితా విడుదల చేయడంపై ఉపాధి హామీ కూలీలు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో వేలాది మంది జాబ్‌కార్డులు కలిగి ఉండి కనీసం 20 రోజులకు తక్కువ కాకుండా ఉపాధి హామీ పనులకు హాజరయ్యారు.
వారిలో భూమిలేని వారు ఎంతోమంది ఉన్నారు. అయితే అధికారులు కేవలం 14,284 మందిని మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఎంపిక చేయడంతో మిగిలిన వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. అర్హుల ఎంపికలో అవకతవకలు జరిగాయని.. అధికారులు పైరవీలకే ప్రాధాన్యమిచ్చారని ఉపాధి కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– రంగారెడ్డి, జనవరి 31 (నమస్తే తెలంగాణ)
జిల్లాలోని 21 మండలాల్లో 558 గ్రామాలున్నాయి. వాటిలో 1,83,309 జాబ్‌కార్డులున్నాయి. ఈ కార్డులు ఉన్న వారంతా ప్రతిరోజూ ఉపాధి హామీ పనులు చేసుకుని జీవిస్తున్నారు. జాబ్‌కార్డులు కలిగిన వారి ఇం డ్లలో ఉన్నవారు 3,77,087 వారు కూడా ఉపాధి పనులు చేసుకుంటు న్నారు. జాబ్‌కార్డు ఉంటే ఇంట్లోని మిగిలిన వారు కూడా కూలీ పనులు చేసుకునేందుకు అర్హులు. ఈ పథకం కింద జిల్లాలో ఉపాధి హామీ పనులు చేసుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. ప్రజాపాలనలో భూమి లేని వ్యవసాయ కూలీలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద చాలామంది దరఖాస్తు చేసుకున్నారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద జిల్లాలో అర్హులను గుర్తించి వారికి ఏ డాదికి రూ.12,000 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూమి లేని..ఉపాధి హామీ పథకంలో ఏడాదిలో కనీసం 20 రోజులపాటు పని చేసిన వారు జిల్లాలో 1,83,309 మంది ఉన్నారు. కానీ, వారిలో కేవలం 14,284 మందిని మాత్రమే ఏ విధంగా గుర్తించారనేది ప్రశ్నార్థకంగా మారింది. అర్హులను ఎంపిక చేయడంలో పైరవీలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని ప్రజలు మండిపడుతున్నారు. జిల్లాలో అర్హత కలిగిన వారందరినీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద గుర్తించాలని పలువురు కోరుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రతి ఏడాది ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటిం చింది. కానీ, ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో 20 రోజులు పని చేసి ఉన్న వారికే ఆత్మీయ భరోసాను వర్తింపజేస్తామని కొర్రీలు పెట్టడం సరైంది. భూముల్లేకుండా ఉపాధి హామీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న వారు జిల్లాలో చాలామంది ఉన్నారు. వారందరికీ ఆత్మీయ భరోసా కింద రూ.12 వేల ఆర్థిక సాయాన్ని అందించాలి.
– బాలకృష్ణగూడ, మీర్ఖాన్పేట
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులను ఎంపిక చేయడంలో అధికారులు వివక్ష చూపుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరినీ పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలి. ఈ పథకానికి జిల్లాలో కేవలం 14,284 మందినే ఎంపిక చేయడం సరైందికాదు. పైరవీలకే ప్రాధాన్యమిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
– బుగ్గరాములు, సీపీఎం మండలాధ్యక్షుడు