నగర ప్రజలపై విద్యుత్ భారం పడనుంది. ఇకపై మొబైల్ కోసమే కాదు.. కరెంట్ కోసం కూడా రీచార్జ్ చేసుకోవలసిన పరిస్థితి రానుంది. కరెంట్ విషయంలో ఈ రీచార్జ్ వ్యవహారం నగరవాసికి చుక్కలు చూపించనుంది. ఏదైనా పనిలో పడి రీచార్జ్ చేయడం మరిచిపోతే కరెంట్ పోవడం ఖాయమని అధికారులే చెబుతున్నారు. మరో రెండు మూడు నెలల్లో దక్షిణ డిస్కం పరిధిలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. స్మార్ట్ మీటర్ల భారాన్ని వినియోగదారులే భరించాలంటూ, స్మార్ట్, ప్రీ పెయిడ్ మీటర్లకు అయ్యే ఖర్చును ఒకేసారి కాకుండా విడతల వారీగా వినియోగదారుల నుంచి వసూలు చేస్తామన్నారు. ఇప్పటికే స్మార్ట్ మీటర్లను వినియోగంలోకి తెచ్చిన ప్రాంతాల్లో వినియోగదారులు తాము గతం కంటే కరెంట్ బిల్లులు ఎక్కువగానే చెల్లించాల్సి వస్తున్నదన్నారు. స్మార్ట్ మీటర్ల బిగింపుపై యూపీలో ప్రజాగ్రహం పెల్లుబికింది. దీంతో ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్‌ను తప్పనిసరి చేయాలన్న ఉత్తర్వులను అక్కడి ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
– సిటీబ్యూరో, ఆగస్ట్ 21 (నమస్తే తెలంగాణ)
స్మార్ట్ మీటర్లు అంటే ఒక రకంగా మొబైల్లో టాక్‌టైమ్, డేటాను రీచార్జ్ చేసుకున్నట్లే ఎంత విద్యుత్ అవసరమో ఆ మేరకు ముందుగానే డబ్బులు కట్టి రీచార్జ్ చేసుకోవాలి. దీంతో తెలంగాణలో నెమ్మదిగా ప్రజల్లోకి స్మార్ట్ మీటర్లను తీసుకెళ్లే ప్రయోగం మొదలుపెట్టారు. దక్షిణ డిస్కం పరిధిలో కొత్తగా విద్యుత్ కనెక్షన్ తీసుకుంటున్న వారికి స్మార్ట్ మీటర్లు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మీటర్లకు అయ్యే ఖర్చుకు సంబంధించి వినియోగదారులే భరించాల్సి ఉంటుంది కాబట్టి వారిపై భారం పడినట్లు ఏర్పడనీయకుండా వాయిదాల పద్ధతిలో బిల్లులోనే ఈ మీటర్‌కు సంబంధించిన చార్జీలను రుద్దే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో మీటర్ ఖరీదు సుమారు రూ.5వేల నుంచి 8వేల వరకు ఉన్నట్లుగా అధికారులు అంటున్నప్పటికీ ఇప్పటివరకు ఏ మీటర్లు పెట్టాలనేది నిర్ణయించలేదని, మీటర్ల ఖరీదును వినియోగదారుడిపై మోపే క్రమంలోనే ఈఎంఐ మాదిరిగా వాయిదాలను వాడుతామని దక్షిణ డిస్కం ఉన్నతాధికారులు వెల్లడించారు.
స్మార్ట్ మీటర్లు అంటే సాధారణ మీటర్ల కంటే అధునాతనమైనవి. ఇవి రియల్ టైమ్‌లో విద్యుత్ వినియోగాన్ని రికార్డు చేసి మొబైల్ యాప్ లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా వినియోగదారుడికి సమాచారం అందిస్తాయి. ప్రీ పెయిడ్ విధానంలో పనిచేసే ఈ మీటర్లు మొబైల్ రీచార్జ్‌లాగా పనిచేస్తాయి. బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత చార్జ్ చేయకపోతే విద్యుత్ సరఫరా ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఇది బిల్లింగ్ కచ్చితత్వాన్ని పెంచి, అంచనా బిల్లులను తొలగించి విద్యుత్ చోరీని అరికట్టడంలో సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు. గతంలో జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో పైలట్ ప్రాజెక్ట్‌గా సుమారు 12వేల స్మార్ట్ మీటర్లు అమర్చారు.
నేషనల్ స్మార్ట్ గ్రిడ్ మిషన్ డేటా ప్రకారం ఈ ప్రాజెక్టులో 11904 వినియోగదారులకు వీటిని ఇచ్చారు. అయితే ఈ అనుభవం ఆధారంగానే ఇప్పుడు టీజీఎస్పీడీసీఎల్ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. కొత్తగా విద్యుత్ కనెక్షన్ తీసుకునే వినియోగదారులకు ఇకపై స్మార్ట్ మీటర్లే ఇస్తారు. ఆ తర్వాత దశలవారీగా కార్యాలయాలు, వ్యాపారవాణిజ్య సంస్థలు, అధిక వినియోగం ఉన్న గృహాలకు అమర్చనున్నట్లు తెలిపారు. స్మార్ట్ మీటర్ల అమలులో కొన్ని సమస్యలు ఉన్నాయి.
వినియోగదారుల్లో ప్రీపెయిడ్ విధానంపై అవగాహన లోపం, డేటా సెక్యూరిటీ ప్రధానంగా సమస్యలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డేటా నిర్వహణ వ్యవస్థలు సరిగ్గా లేకపోతే వినియోగదారులకు రకరకాల సాంకేతిక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. సైబర్ క్రైమ్‌లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ స్మార్ట్ మీటర్ల వినియోగంకు సంబంధించి ప్రత్యేక సెక్యూరిటీ వ్యవస్థ అవసరమనే అభిప్రాయాన్ని విద్యుత్ రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టీజీఎస్పీడీసీఎల్ డేటా నెట్వర్క్ మ్యాపింగ్ పూర్తి చేసింది.
కొత్తగా విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్న చోట స్మార్ట్ మీటర్లు పెడుతుంటే.. మరోవైపు పాతవాటిని కూడా స్మార్ట్వైపుకు మరల్చే దిశగా ఎస్పీడీసీఎల్ యాజమాన్యం తమ సిబ్బందికి ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఈ మేరకు తమ పరిధిలో ఉన్న మీటర్ల వివరాలను తీసుకుని వాటిలో ఏయే ప్రాంతాల్లో ముందుగా స్మార్ట్ మీటర్లు బిగిస్తే బాగుంటుందో పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్తో పాటు బంజారాహిల్స్ సర్కిల్లో పాత వాటికి బదులు స్మార్ట్ మీటర్లను బిగించడం,దశల వారీగా అన్ని సర్కిళ్లలో ఇదే ఆలోచనను అమలు చేయడానికి డిస్కం అధికారులు సిద్ధమైనట్లు ఒక ఉన్నతాధికారి చెప్పారు.
ఎప్పుడు ఏ సమయంలో మీటర్ మారుతుందో మాత్రం ఇప్పుడే చెప్పలేమని, జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 63లక్షల కనెక్షన్లు ఉన్నాయని, ఇందులో డొమెస్టిక్, కమర్షియల్ కనెక్షన్లను చూసుకుంటూ ముందుగా కమర్షియల్‌ను పూర్తి చేసి ఆ తర్వాత గృహ వినియోగదారులవైపు దృష్టి పెడుతామని ఆ అధికారి చెప్పారు. స్మార్ట్ మీటర్లతో తమపై రీడింగ్, బిల్లింగ్ భారం తగ్గుతుందని, అయితే వీటి విషయంలో సరైన సాంకేతికత వినియోగించకపోతే వినియోగదారుడు, సంస్థ రెండూ పెద్ద సమస్యలను ఎదుర్కొనే అవకాశముంటుందని విద్యుత్ రంగానికి చెందిన కొందరు సాంకేతిక నిపుణులు అంటున్నారు. సీఎండీ జితేశ్ పాటిల్ స్మార్ట్ మీటర్ల విషయం మాట్లాడినప్పటినుంచి మరోసారి ఈ అంశం తెరపైకి రావడంతో ప్రస్తుతం డిస్కంలో ఈ స్మార్ట్ వ్యవహారం చర్చనీయాంశమైంది. నగరవాసులు సైతం తమకు ఎప్పుడు స్మార్ట్ బిగిస్తారోనంటూ ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది.