Santapur | కేశంపేట, జూన్ 29 : కేశంపేట మండల పరిధిలోని సంతాపూర్ గ్రామంలో విద్యుత్ స్తంభాలు, తీగలు ప్రమాదకరంగా మారాయని గ్రామస్తులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన కర్రె నర్సింహా ఇంటిపై నుంచి వెళుతున్న విద్యుత్ తీగలు వెళుతుండడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నాడు. విద్యుత్ తీగలను సరి చేయాలని పలుమార్లు ట్రాన్స్కో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వాపోతున్నాడు.
అదేవిధంగా కర్రెడ్ల నరేందర్రెడ్డి వ్యవసాయ పొలం సమీపంలోగల విద్యుత్ స్తంభం కిందకు ఒరిగి ప్రమాదకరంగా మారిందని, కిందకు ఒరిగిన విద్యుత్ స్తంభంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక సంతాపూర్ – కోనాయపల్లి గ్రామాల మధ్య కావలి కృష్ణ వ్యవసాయ పొలం సమీపంలోగల విద్యుత్ స్తంభం నెర్రలు పారడంతో సమీపంలోని రైతులు భయాందోళనకు గురవుతున్నట్లు బీఆర్ఎస్ నాయకుడు సాజిద్ తెలిపాడు. సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదకంగా మారిన విద్యుత్ స్తంభాలు, తీగలను సరి చేయాలని ప్రజలు కోరుతున్నారు.