మే 1 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపడుతున్నామని చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో పార్లమెంటు ఎన్నికల పోలింగ్, కౌంటింగ్, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, ఎపిక్ కార్డుల పంపిణీ, పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాల కల్పన, పోస్టల్ బ్యాలెట్ కోసం చేపట్టిన చర్యలు, ఓట్ ఫ్రమ్ హోమ్, పోలింగ్ సిబ్బందికి శిక్షణ, ఈవీఎంల ర్యాండమైజేషన్, నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎంల తరలింపు, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల వద్ద చేపడుతున్న భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు.
ఓట్ల లెకింపు కేంద్రాలతో పాటు, డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సెంటర్ల వద్ద చేసిన ఏర్పాట్లు, సువిధ ద్వారా అనుమతుల జారీ, సీ-విజిల్ లో వచ్చిన ఫిర్యాదుల పరిషారం, పోటీలో ఉన్న అభ్యర్థులకు ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలను అందజేయడం తదితర అంశాలపై జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ఎన్నికల సన్నద్ధతను కలెక్టర్ శశాంక సీఈవోకు వివరించారు. 43 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలను అందజేయడంతో పాటు ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా అభ్యర్థులందరికీ గుర్తులు కేటాయించామన్నారు.
అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కోసం 3 బ్యాలెట్ యూనిట్లు వినియోగించాల్సి ఉన్నదని, ఈ మేరకు బుధవారం ఐసీఐఎల్ నుంచి బ్యాలెట్ యూనిట్లు ఈవీఎం గోడౌన్‌కు చేరుకోనున్నాయని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈసీఐఎల్ ఇంజినీర్ల బృందంచే వాటి ఎఫ్ఎల్సీ జరిపిస్తున్నామని, ర్యాండమైజేషన్ అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ నియోజకవర్గ కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.
ఓటరు సమాచార స్లిప్పులతో పాటు ఓటరు గైడ్, సి-విజిల్ కరపత్రాన్ని సైతం సిబ్బందిచే ఇంటింటికీ తిరిగి పంపిణీ చేయిస్తున్నామన్నారు. కొత్త ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరుపుతున్నామని, నిర్ణీత గడువులోపు పంపిణీని పూర్తి చేస్తామన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పిస్తూ, అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, 85 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్ ఓటర్లు, దివ్యాంగ ఓటర్లు ఇంటి వద్ద నుంచే ఓటు హకును వినియోగించుకునేందుకు వీలుగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
ఈ బృందాలకు డమ్మీ బ్యాలెట్ పేపర్ ద్వారా ప్రయోగాత్మకంగా శిక్షణ ఇప్పించామని, పూర్తి పారదర్శకంగా, గోప్యతను పాటిస్తూ ఓటు సేకరించేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవోలు, ఏపీవోలు, ఓపీవోలకు కూడా రెండో విడుత శిక్షణ కొనసాగుతున్నదని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. కౌంటింగ్ కేంద్రంతో పాటు డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పకడ్బందీ ఏర్పాటు చేశామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అదనపు పోలీసు బలగాలను మోహరించేలా చర్యలు తీసుకున్నామని సీఈవో దృష్టికి తెచ్చారు.
సువిధ పోర్టల్ ద్వారా వచ్చే దరఖాస్తులను సకాలంలో పరిశీలిస్తూ త్వరితగతిన అనుమతులు జారీ చేస్తున్నామని, సీ-విజిల్ ఫిర్యాదులతోపాటు జిల్లా స్థాయిలో నెలకొల్పిన కంట్రోల్ రూమ్‌కు 1950 ద్వారా వచ్చే ఫిర్యాదులకూ సకాలంలో స్పందిస్తూ చర్యలు తీసుకుంటున్నామన్నారు. జర్నల్ అబ్జర్వర్, వ్యయ అబ్జర్వర్లతో ఈ నెల 3, 7, 11 తేదీల్లో ఎక్స్పెండేచర్ ఇన్స్పెక్షన్ జరుగుతుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్వో సంగీత, జడ్పీ సీఈవో కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.