కడ్తాల్, అక్టోబర్ 14 : ట్రిపులార్, గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు సంబంధించిన అలైన్మెంట్లను మార్చేలా కాంగ్రెస్ సర్కార్‌పై ఒత్తిడి తీసుకురావాలని మంగళవారం మాజీ మంత్రి హరీశ్‌రావును మండలంలోని ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన రైతులు, బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్ర భుత్వం రైతులకు తక్కువ నష్టం కలిగేలా ట్రిపులార్ అలైన్‌మెంట్‌ను రూపొందిస్తే.. ప్రస్తుత రేవంత్ సర్కార్ భూస్వాములకు ఎక్కువ మేలు జరిగేలా.. చిన్న, సన్నకారు రైతులకు నష్టం జరిగేలా.. కొత్తగా ట్రిపులార్ అలైన్‌మెంట్‌ను రూపొందించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా హైదరాబాద్-శ్రీశైలం హైవేకు నాలుగైదు కిలోమీటర్ల దూ రంలో ఉన్న ఏక్వాయిపల్లి సమీపం నుంచి ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును నిర్మిస్తుండడంతో రైతులకు తీవ్రంగా నష్టం జరగనున్నదని వివరించారు. స్పందించిన హరీశ్‌రావు మాట్లాడుతూ.. ట్రిపులార్, గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీఇచ్చారన్నారు. హరీశ్‌రావును కలిసిన వారిలో సింగిల్‌విండో డైరెక్టర్ వీరయ్య, ముత్యం, భిక్షపతి, వంశీ, లక్ష్మణ్, నర్సింహ ఉన్నారు.