పరిగి, జనవరి 18: సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని పరిగి ఎంపీపీ కరణం అరవిందరావు సూచించారు. బుధవారం ఎంపీపీ అరవిందరావు అధ్యక్షతన పరిగి మండల సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ అరవిందరావు మాట్లాడుతూ సమావేశం సందర్భంగా సభ్యులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. సమస్యలు గల గ్రామాలను అధికారులు స్వయంగా సందర్శించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. ప్రధానంగా కరెంటు, మిషన్ భగీరథ అధికారులు తప్పనిసరిగా గ్రామాలకు వెళ్లి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని చెప్పారు. ప్రభు త్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల స్వరూపం మారిందని, పచ్చదనం, పరిశుభ్రతకు నిలయాలుగా గ్రామాలు మారాయని తెలిపారు. సర్పంచ్‌లు లేవనెత్తిన సమస్యలను ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సహకారంతో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు.
గురువారం ఉదయం మండలంలోని చిట్యాల్‌లో కంటివెలుగు కార్యక్రమాన్ని ఎమ్మె ల్యే మహేశ్‌రెడ్డి ప్రారంభిస్తారని, ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జడ్పీటీసీ బి.హరిప్రియ మాట్లాడుతూ ప్రతి అంశంపై అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు జరిగేలా చూడాలన్నారు. మార్కెట్ కమి టీ చైర్మన్ సురేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా గ్రామాలలో కొనసాగిస్తున్నారని సర్పంచ్‌లను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శేషగిరిశర్మ, వైస్ ఎంపీపీ కె.సత్యనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, ఎంపీవో దయానంద్, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.