వికారాబాద్, మార్చి 24 : క్షయ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. గురువారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినం సందర్భంగా వికారాబాద్ డీఎంహెచ్వో కార్యాలయం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు వైద్యాధికారులు, సిబ్బంది చేపట్టిన ర్యాలీని డీఎంహెచ్వో తుకారాం జెండా ఊపి ప్రారంభించారు. అనంతగిరి టీబీ ఆడిటోరియంలో కలెక్టర్ నిఖిల జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్షయవ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వికారాబాద్ జిల్లాలో ఎక్కడా లేనివిధంగా టీబీ శానిటోరియం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ప్రస్తుతం టీబీ దవాఖానలో 32 మంది వైద్య సేవలు పొందుతున్నారని తెలిపారు. వ్యాధిగ్రస్తులకు చికిత్స చేయడంతోపాటు ప్రతి నెల పోషణ భత్యం కింద రూ.500 చెల్లిస్తారని పేర్కొన్నారు. క్షయ వ్యాధి నివారణకై వైద్య సిబ్బంది సంయుక్తంగా పని చేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఉత్తమ వైద్య సేవలు అందించిన సిబ్బందికి, క్షయ వ్యాధి తగ్గిన పలువురికి మెమెంటోలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో టీబీ దవాఖాన సూపరింటెండెంట్ సుధాకర్షిండే, ప్రోగ్రామ్ ఆఫీసర్ లలిత, డాక్టర్ అరవింద్, జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ రవీంద్రయాదవ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
షాబాద్, మార్చి 24 : జిల్లాలో టీబీని పూర్తిగా నిర్మూలించేందుకు అందరూ కృషి చేయాలని రంగారెడ్డిజిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి అన్నారు. ప్రపంచ టీబీ దినం సందర్భంగా గురువారం నగరంలోని మన్సూరాబాద్ కామినేని దవాఖానలోని ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. అనంతరం వాల్పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో టీబీ కేసులు, మరణాల సంఖ్యను తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ తయారుచేసినట్లు తెలిపారు. 2025 వరకు టీబీ ఫ్రీ ఇండియా చేయాలని నిర్ణయించుకుని కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో 936 మంది టీబీ ఫస్ట్ రోగులను గుర్తించినట్లు తెలిపారు. 2021లో జిల్లాలో 4453 కేసులు టీబీ నోటిఫై చేశామని, అందులో పబ్లిక్ 2405, ప్రైవేట్ 2048 మందిని గుర్తించి చికిత్స అందించినట్లు చెప్పారు. టీబీ హెచ్ఐవీ కేసుల్లో 93 మందిని గుర్తించి చికిత్స అందించామన్నారు. రోగులకు పోషకాహార ఖర్చుల నిమిత్తం 2018 నుంచి 2020 వరకు 10,529 మందికి రూ.2.6కోట్లు, 2021లో రూ.77లక్షలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. 2021లో ఏసీఎఫ్ కార్యక్రమంలో భాగంగా 2,09,085 జనాభా నుంచి 60,271 మందిని పరీక్షించగా అందులో 4324 మంది వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించామన్నారు. వైద్యపరీక్షలు చేయించగా.. అందులో 162 మందిని టీబీ వ్యాధిగ్రస్తులుగా గుర్తించడం, వారికి చికిత్స చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నరసింహారెడ్డి, జిల్లా క్షయ నివారణ అధికారి అరుణకుమారి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.