యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 27 : యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుకల్యాణ సుముహూర్త నిర్ణయ ఘట్టమైన ఎదుర్కోలు మహోత్సవం సోమవారం రాత్రి వైభవోపేతంగా సాగింది. ప్రధానాలయ పునఃప్రారంభానంతరం తొలిసారిగా తూర్పు రాజగోపురం ఎదురుగా తిరుమాఢవీధుల్లో స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తజనుల జయజయ ధ్వనులు, అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణలతో అలంకార నరసింహుడిని అశ్వ వాహనంపై ప్రధానాలయ కల్యాణ మండపం నుంచి ఉత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. స్వామివారిని పశ్చిమ దిశకు అభిముఖంగా, అమ్మవారిని తూర్పునకు అభిముఖంతో ఎదురెదురుగా ప్రతిష్ఠించారు. ఇరువైపులా అధికారులు, అర్చకులు, రుత్వికులు ఆసీనులై పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు.
అర్చకులు, వేదపండితులు, అధికారులు స్వామి, అమ్మవార్ల వైపు రెండు జట్లుగా ఎదుర్కోలు తంతును నిర్వహించారు. అమ్మవారి తరఫున పాల్గొన్న భద్రాచలం దేవస్థానం వేద పండితుడు మురళీకృష్ణమాచార్యులు, అర్చకులు అమ్మవారి అందచందాలు, సుగుణాలను కీర్తించారు. స్వామివారి తరఫున పాల్గొన్న యాదగిరిగుట్టకు చెందిన సంస్కృత విద్యాపీఠం విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు ధరూరి రామానుజాచార్యులు స్వామివారి మహిమలు వివరించారు. ‘అమ్మలేనిది స్వామి లేడు.. స్వామిని లోకానికి పరిచయం చేసింది అమ్మవారే’ అనే అంశాన్ని ఉదాహరణలతో వివరించారు. పంచనారసింహుడి క్షేత్రంలో స్వామి అపూర్వమైన అనుగ్రహం లోకాలకు అందింపజేస్తున్నది అమ్మవారేనని తెలిపారు. స్వయంభూ అంటేనే అమ్మవారని అన్నారు. మరోవైపు అర్చక బృందం స్వామివారి మహిమలు, భక్తజన రక్షణలు వివరిస్తూ ఆసక్తికరంగా వాదాలు జరిపారు. అదేవిధంగా అమ్మవారి తరఫున యాదగిరిగుట్ట ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొనగా.. స్వామివారి తరఫున ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఆలయ ఈఓ ఎన్.గీత, ప్రధానార్చకుడు నల్లన్థీఘల్ లక్ష్మీనర్సింహాచార్యులు పాల్గొన్నారు. అమ్మవారితో స్వామివారి కల్యాణం మంగళవారం రాత్రి 9:30గంటలకు జరుపడానికి ముహూర్తం నిశ్చయించారు.
పరమాత్మ అద్భుత, సౌందర్య స్వరూపమే జగన్మోహిని
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు సోమవారం మోహినీ స్వరూపంలో భక్తకోటికి దర్శనమిచ్చారు. తన జగన్మోహన లీలా విలాసాన్ని తెలియజేస్తూ మానవ కోటిని సంరక్షించే అపూర్వమైన స్వరూపమే ఈ అవతారమని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. దేవతలకు అమృతం అందించడంలో ఈ మోహినీ రూపం స్వీకరించినప్పటికీ ధర్మ రక్షణకు మహర్షులు ఈ అవతారాన్ని దర్శించారు. అందరినీ తన ముగ్ధమోహన, రూప, లావణ్య, కారుణ్యాది విశేషాలతో అనుగ్రహిస్తూ.. లోకోత్తరమైన సౌందర్యాన్ని, ఆకర్షణ శక్తిని కలిగి మోహినీ స్వామిగా కనిపించే శ్రీమన్నారాయణుడి లీల విలాస స్వరూపం భక్తులకు దర్శింపజేస్తూ ఆనందింపజేయుటే జగన్మోహినీ అలంకార ప్రత్యేకత అని అర్చకులు తెలిపారు.
వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైటీడీఏ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. డాక్టర్ జొన్నలగడ్డ అనూరాధ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన, యాదగిరిగుట్టకు చెందిన శ్రీవైష్ణవ సేవ సమాఖ్య వారి ప్రభాతభేరి, రాయగిరికి చెందిన శ్రీరామభక్త భజన మండలి, హైదరాబాద్‌కు చెందిన సాయిబాబా సేవా సమితి, శ్రీరామాంజనేయ భజన మండలి వారి భజన కార్యక్రమాలు, ఆస్థానం వారి మంగళ వాయిద్యాలు, వైదిక ప్రార్థన, జనగామ జిల్లాకు చెందిన శ్రీమాన్ టీఎన్సీ కృష్ణమాచార్యులు సిద్ధాంతి గారి యాదగిరి క్షేత్ర మహిమపై ఉపన్యాసం భక్తులను ఆకట్టుకున్నాయి. మడమల రాంబాబు, భాగవతార్ వారి గజేంద్ర మోక్షం హరికథ గానం, హైదరాబాద్‌కు చెందిన డీఎస్ శ్రీదేవి ఆధ్వర్యంలో భక్తి సంగీతం, శ్రీనటరాజ కళాక్షేత్రం వారి కూచిపూడి నృత్య ప్రదర్శన, గడ్డం సుదర్శన్ బృందం చిందు యక్షగానాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీకర, సాయిసంజీవని దవాఖాన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
13వేల మంది వీక్షించేలా ఏర్పాట్లు
యాదగిరిగుట్ట కొండపైన పునఃప్రారంభానంతరం తొలిసారిగా జరిగే తిరు కల్యాణోత్సవాన్ని సుమారు 13వేల మంది భక్తులు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. తూర్పు మాఢవీధుల్లో వీవీఐపీ, వీఐపీలు, కల్యాణంలో పాల్గొనే భక్తులకు ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఉత్తర మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్ ప్రాంగణంలో భక్తులు వీక్షించేందుకు సకల ఏర్పాట్లు.. ఎల్ఈడీ స్క్రీన్లు, కొండపైన వీవీఐపీ పార్కింగ్, కొండపైన బస్టాండ్, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. దాతల సహకారంతో మంచినీటి వసతి కల్పించారు. వైద్య సిబ్బంది, విద్యుత్ అధికారులు, పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంచనున్నారు.
నేడు తిరుకల్యాణ మహోత్సవం
యాదగిరి లక్ష్మీనరసింహస్వామివారి ముఖ్య ఘట్టమైన తిరుకల్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ప్రధానాలయ పునః ప్రారంభానంతరం తొలిసారిగా జరిగే కల్యాణోత్సవం తూర్పు మాఢవీధుల్లో ఆగ్నేయ దిశలో నిర్మించిన బ్రహ్మోత్సవ మండపంలో నిర్వహించనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయ అధికారులు పూర్తి చేశారు. బ్రహ్మోత్సవ మండపాన్ని రంగురంగుల పూలతో తీర్చిదిద్దారు. మండపం ఎదురుగా వీవీఐపీ, కల్యాణ భక్తులకు ప్రత్యేకమైన బారికేడ్లతో ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 3వేల కుర్చీలను వేశారు. మండపం ఎదురుగా, ఉత్తర మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్‌పై భక్తులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. వారికోసం ప్రత్యేకంగా 8 ఎల్ఈడీ స్క్రీన్లను అందుబాటులో ఉంచారు. సౌండ్ సిస్టం, రంగురంగుల విద్యుద్దీపాలంకరణతో కల్యాణ మండపం, మాఢవీధులను తీర్చిదిద్దారు. బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతస్థాయి అధికారులు హాజరు కానున్నారు. స్వామివారి తిరుకల్యాణ మహోత్సవంలో 325 మంది కల్యాణం నిర్వహించే భక్తులు పాల్గొననున్నారు. కల్యాణోత్సవానికి వీవీఐపీల తాకిడి పెరుగనున్న నేపథ్యంలో ఉత్సవం ప్రశాంతంగా నిర్వహించేందుకు డీసీపీ రాజేశ్చంద్ర నేతృత్వంలో సమారు 300 మంది బందోబస్తు నిర్వహించనున్నారు.
కల్యాణ గణములను తెలిపేందుకే ఎదుర్కోలు
లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన వేడుక స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం. జీవ, పరమాత్మకు ఇద్దరికీ నిర్వహింపబడే నిత్య సమ్మేళన రూపమైన పరమార్ధతత్వమే ఈ ఎదుర్కోలు అని ఆలయ ప్రధానార్చకుడు తెలిపారు. జీవన ప్రతినిధి అయిన అమ్మవారు, జీవకోటిని పరమాత్మతో విడదీయరాని నిత్య సంబంధాన్ని గుర్తు చేసి ఆచార్యులను, ఆత్మ జీవ తత్వాలను వెంటబెట్టుకొని పరమాత్మను ఆశ్రయింపజేయుట ఈ వేడుకలోని పరమార్థం అన్నారు. స్వామివారు అశ్వ వాహనారూఢుడై భక్తులను అనుగ్రహించుట ఎంతో ప్రశస్తమైనది. అశ్వం అనగా ఇంద్రియాలకు సంకేతం. ‘ఇంద్రియాణి హయాన్యాహ్రః అని ఉపనిషద్వాక్యం. జీవకోటి ఇంద్రియానిగ్రహం పాటించిన జన్మరాహిత్యం కలిగి మోక్షం లభించునని అంతరార్థం. ‘మనః ఏవమనుష్యాణాం కారణం బంధమోక్షయోః’ మనస్సు చెంచలమునకు ప్రతీక. అశ్వం వలె చెంచలం కలిగిన మనస్సును నిగ్రహించుట భగవానుడికే సాధ్యమని అభయముద్రతో రక్షించగలనని స్వామి జీవకోటికి అభయ మునిస్తూ అనుగ్రహించుట ఈ వాహన సేవ ప్రత్యేకతను కలిగియున్నది. ఎదుర్కోలు మహోత్సవాల్లో అశ్వరూఢుడైన లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించిన వారికి పరిపూర్ణ అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగునని వేదాలు పేర్కొనుచున్నవని ఆలయ ప్రధానార్చకులు వివరించారు.
తొలిసారి బ్రహ్మోత్సవాలకు నలుగురు మంత్రులు
యాదగిరిగుట్ట ప్రధానాలయ పునఃప్రారంభానంతరం తొలిసారిగా జరిగే స్వామివారి బ్రహ్మోత్సవ తిరుకల్యాణానికి నలుగురు రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు, విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి హాజరు కానునున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామివారి తిరుకల్యాణోత్సవంలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు.
పట్టువస్ర్తాలు సమర్పించిన పద్మశాలి సంఘం
యాదగిరిగుట్టకు చెందిన అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు సోమవారం పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను అందజేశారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు దికొండ జోగయ్య, అంకం నరసింహ, కైరంకొండ సుదీశ్, కాటబత్తిని ఆంజనేయులు పాల్గొన్నారు.
యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో తరించిన సీఎంలు
గతంలో నిర్వహించిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పలువురు ప్రముఖులు పాల్గొని తరించారు. ముఖ్యమంత్రి హోదాలో టి.అంజయ్య బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. మర్రి చెన్నారెడ్డి సీఎం హోదాతోపాటు పంజాబ్ గవర్నర్ హోదాలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. 1983లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నందమూరి తారకరామారావు లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని పట్టువస్ర్తాలు సమర్పించి కల్యాణంలో పాల్గొన్నారు. 2015 ఫిబ్రవరి 27న కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని పట్టువస్ర్తాలు సమర్పించారు. 2021, 2022లో జరిగిన తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
ముగ్ధ మనోహరంగా జగన్మోహినీ అలంకారం
లక్ష్మీనరసింహస్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవంలో విశేష ఘట్టమైన స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం రోజున స్వామివారిని ముగ్ధమనోహరంగా జగన్మోహినీ అలంకారంలో పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేశారు. జగన్మోహినీ అలంకార సేవను ప్రధానాలయ తిరుమాఢవీధుల్లో అత్యంత వైభవంగా ఊరేగింపు చేపట్టారు. పట్టువస్ర్తాలు, బంగారు, వజ్ర వైడూర్యాలు, ముత్యాల ఆభరణాలు, వివిధ పుష్పాలతో స్వామివారిని అలంకరించి ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, పారాయణికులు ముందు నడుస్తుండగా వీధుల్లో ప్రత్యేక సేవను నిర్వహించారు. మూలమంత్ర జపాలు, స్తోత్రాలు, మంత్రోచ్ఛరణ, ఆళ్వారు దివ్య ప్రబంధ పాశురాలను పఠిస్తూ మంగళ వాయిద్యాల నడుమ భక్తులు గోవిందా.. గోవిందా అంటూ పాల్గొన్నారు. కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ ఈఓ ఎన్.గీత, డిప్యూటీ ఈఓ దోర్బల భాస్కర్, ఆలయ ప్రధానార్చకులు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, ఆలయ అధికారులు గజవెల్లి రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.