“భూమిని నమ్ముకొని బతుకుతున్న మాకు సీఎం కేసీఆర్ పెద్ద మనస్సు చేసుకొని పట్టాలిచ్చిండు.. ఎన్నో ఏండ్ల కల సాకారం చేసిన ఆయన మా పాలిట దేవుడు” అని పోడు పట్టాలు అందుకున్న గిరిపుత్రులు సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి సబితారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై అర్హులైన 436 మందికి 552 ఎకరాలకు సంబంధించిన పట్టాలను అందజేశారు. పట్టాలందుకున్న లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివెరిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వరాష్ట్ర ఫలాలు ఇంటింటికీ అందుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే పోడు పట్టాలొచ్చాయన్నారు. గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా ఉంటామని ప్రతిన బూనారు. పలుచోట్ల ముఖ్యమంత్రి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి సంబురాలు చేసుకున్నారు.
వికారాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): గిరిజనుల ఎన్నో ఏండ్ల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని, ఇన్నేండ్లు భయంతో సాగు చేసుకుంటున్న గిరిజనులకు భరోసానిచ్చి, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా పోడు భూములపై సంపూర్ణ హక్కులు కల్పించారని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పా టు చేసిన పోడు పట్టాల పంపిణీ కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, ఎమ్మెల్యేలతో కలిసి ఆమె హాజరై అర్హులైన 436 మందికి 552 ఎకరాల పోడు భూముల పట్టాలను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1.50 లక్షల మందికి పోడు పట్టాలను అందజేస్తూ సీఎం కేసీఆర్ గిరిజనుల పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల అధికారుల సంతకాలతో కూడిన పట్టా పాసుపుస్తకాలను రూపొందించారన్నారు. పోడు భూముల పట్టాపాసు పుస్తకం దేశంలోనే ఆదర్శంగా నిలువనున్నదని ఆమె పేర్కొన్నారు. గతంలో పోడు భూములకు పట్టాలిచ్చినప్పటికీ గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఎలాంటి సమస్యలు రావొద్దనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి గిరిజనులకు శాశ్వత పరిష్కారం చూపుతున్నారన్నారు. పోడు పట్టాలు పొందిన రైతులకు పంట పెట్టుబడి నిమిత్తం రైతుబంధు పథ కం కింద డబ్బులను ప్రభుత్వం జమ చేయడంతోపాటు ఉచిత కరెంట్‌ను కూడా సరఫరా చేస్తుందన్నారు. ఇకపై అటవీ భూములు కబ్జా కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. మరోవైపు గత తొమ్మిదేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం తండాల్లో చేసిన అభివృద్ధిని, గిరిజనుల సంక్షేమానికి అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ తెలియజేయాలని మంత్రి పోడు రైతులకు సూచించారు. అదేవిధంగా గిరిజనులంతా సీఎం కేసీఆర్ వెన్నంటి నడిచి మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు.
అర్హులకు పోడు భూముల పట్టాలను దశలవారీగా పంపిణీ చేస్తాం. మొద టి దశలో భాగంగా జిల్లాలో 436 మందికి పోడు పట్టాలను అందజేశాం. ఎవరైనా అర్హులుంటే నిరాశ చెందొద్దు.. వారికీ త్వరలోనే అందిస్తాం. 2005కు ముందు నుంచి అటవీ భూములను సాగు చేసుకుంటున్న వారందరికీ క్షేత్రస్థాయి పరిశీలన చేసి పట్టాలను అధికారులు అందించాలి. గిరిజనుల కలను సాకారం చేసిన సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు. – ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి
తాండూరు, జూన్ 30 : అటవీ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు ప్రభుత్వం పట్టాలను పంపిణీ చేయడంతో శుక్రవారం తాండూరు నియోజకవర్గంలోని గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తాండూరు నియోజకవర్గంలోని 48 మంది రైతులకు 87.42 ఎకరాలకు సంబంధించి పోడు భూముల పట్టాలను అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు గిరిజనులు మా ట్లాడుతూ శతాబ్దాల కల దశాబ్దిలో నెరవేర్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. పోడుపట్టాలు పొందిన గిరిజనులకు త్వరలోనే రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని కూడా ప్రభుత్వం ఇస్తామని పేర్కొనడంతో పంటలను ఎలాంటి అప్పుల్లేకుండా సాగు చేసుకుంటామని సంబురంగా పేర్కొన్నారు. పట్టాలు పొందిన రైతులకు తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పట్టాలు రాని అర్హులుంటే ఆందోళన చెంద్దొని ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి.. వాటి అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులను కేటాయిస్తుండటంతో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్నాయి. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనతో పోల్చితే ప్రస్తుతం తండాల్లో ఎంతో మార్పు వచ్చింది. పోడు పట్టాలు అందుకున్న రైతులు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో సాగు చేసేలా వ్యవసాయాధికారులు వారికి సహకరిం చాలి. -సునీతారెడ్డి, జడ్పీ చైర్పర్సన్
జల్, జంగల్, జమీన్ అని వందేళ్ల క్రితం నుంచి ఉన్న డిమాండ్‌ను సీఎం కేసీఆర్ నెరవేర్చి చరిత్రలో నిలిచిపోయారు. తండాలను గ్రామ పంచాయ తీలు గా ఏర్పాటు చేసి గిరిజనులకే పాలనను అందించారు. గిరిజనుల సంక్షేమానికి గతంలో ఎవరూ చేయని విధంగా కృషి చేస్తున్నారు.
– రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ
ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం 2005కు ముందు నుంచి అటవీ భూములను సాగు చేసుకుంటున్న రైతులను గుర్తించి పూర్తి పారదర్శకంగా అర్హులను ఎంపిక చేశాం. గ్రామ, డివిజన్, జిల్లా స్థాయి కమిటీలు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే పోడు రైతుల ఎంపిక జరిగింది. ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం గిరిజనేతరులు 90 ఏండ్లపాటు సాగులో ఉండాలనే నిబంధన ఉండటంతో గిరిజనేతరులకు పట్టాలివ్వడం లేదు. అర్హులు ఇంకా ఉంటే దరఖాస్తులను పరిశీలించి పట్టాలిస్తాం.
– నారాయణరెడ్డి, కలెక్టర్
గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని మంత్రి సబితారెడ్డి తెలిపారు. గిరిజనుల రిజర్వేషన్‌ను పది శాతానికి పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. అదేవిధంగా జిల్లాలోని 84 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారని, రాష్ట్రవ్యాప్తంగా మూడువేల మంది గిరిజన బిడ్డలు సర్పంచులు, ఎంపీటీసీలుగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. అంతేకాకుండా జిల్లాలో గ్రామ పంచాయతీలుగా ఏర్పాటైన తండాల్లో రోడ్లు, కరెంట్ తదితరాలకు ఒక్కో పంచాయతీకి అధిక నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఎస్టీలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ప్రభుత్వం అమలు చేస్తున్నదని.. జిల్లాలో 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకంతో ఏడువేల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. గిరిజనుల కోసం ప్రభుత్వం బంజారాహిల్స్‌లో బంజారాభవన్‌ను నిర్మించిందన్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోనూ బంజారాభవన్ల నిర్మాణాన్ని సంకల్పించిన ప్రభుత్వం ఒక్కో బంజారాభవన్ నిర్మాణానికి రూ.2కోట్ల చొప్పున నిధులను మంజూరు చేసిందని మంత్రి గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాగానే సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా గిరిజన బిడ్డలు చదువుకునేందుకు ప్రత్యేకంగా గురుకులాలను ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థికి రూ.1.20 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్న దన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసే వారి కోసం ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నదని వివరించారు. పోడు భూముల పట్టాల పంపిణీ దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణీదేవి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సుశీల్‌కుమార్‌గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఇన్చార్జి డీఆర్వో అశోక్‌కుమార్, గిరిజన సంక్షేమ శాఖాధికారి కోటాజీ, అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్, వ్యవసాయాధికారి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
మా పూర్వీకులు, తాతలు, తండ్రుల నుంచి అటవీ భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. ప్రతి వానకాలంలో పంటలను సాగు చేసేటప్పుడు అటవీ శాఖ అధికారులతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. పంటలు సాగు చేయకుండా అడ్డుపడేవారు. భూముల వద్దే ఉండేవారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నా మాకు సీఎం కేసీఆర్ దేవుడిలాగా ముందుకొచ్చారు. పోడు భూములకు పట్టాలిచ్చి ఆదుకుని.. తమ ఏండ్ల నాటి కలను సాకారం చేశారు.
-హిరీబాయి, మక్తావెంకటాపూర్, చౌడాపూర్
పోడు భూములకు పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉంది గత 50 ఏండ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో పోడు భూములు సాగు చేయకుండా అటవీశాఖ అధికారులు
అడ్డుకున్నారు. విత్తనాలు విత్తకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. కానీ.. సీఎం కేసీఆర్ పోడు భూములకు పట్టా లు ఇస్తామని హామీఇచ్చి.. తమ ఏండ్ల నాటి కలను నెరవేర్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.
-బాబుసింగ్, రాంపూర్ తండా, ధారూరు
తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నది. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో పోడు భూములకు పట్టాలివ్వాలని ఎన్నిసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితంలేదు. తెలంగాణ ఏర్పడి.. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతోపా టు అటవీ భూములను సాగు చేసుకుంటున్న మాకు పట్టాలిచ్చి.. తమ ఏండ్ల నాటి కలను నెరవేర్చారు.
-దేవీబాయి, పులిచింతలమడుగు తండా, ధారూరు
గత ఉమ్మడి ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేదు. మా సమస్యలను పరిష్కరించలేదు. మాకు అటవీ భూములే ఆధారం. మా తాతల కాలం నుంచి ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నాం. వ్యవసాయం తప్పా ఇతర ఉపాధి మాకు లేదు. పోడు భూములకు పట్టాలివ్వాలని గత ప్రభుత్వాలకు పలు సార్లు విన్నవించినా పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ మా సమస్యలను గుర్తించి అండగా నిలిచారు. పోడు భూములకు పట్టాలివ్వడం చాలా సంతోషంగా ఉన్నది. -శాంతి, ఇస్మాయిల్‌పూర్, బషీరాబాద్
మేము సాగు చేసుకుంటు న్న పోడు భూములకు సీఎం కేసీఆర్ పట్టాలిచ్చి ఆదుకోవడం చాలా సంతోషకరం. ఇప్పటి నుంచి మాకు అటవీ శాఖ అధికారు ల నుంచి ఇబ్బందులు ఉం డవు. మా భూములను మేము దర్జాగా సాగు చేసుకుంటాం. సీఎం కేసీఆర్ ఇచ్చి న మాటలకు కట్టుబడి పోడు భూములకు పట్టాలిచ్చి మాకు దేవుడిలా నిలిచారు.
-లాలూనాయక్, పులిచింతల మడుగుతండా, ధారూరు