తుర్కయంజాల్, జూన్ 28: పౌష్టికాహార పంపీణీతో పాటు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యనందిస్తూ, పలు ప్రభుత్వ పథకాల అమలులో కీలకంగా మారిన అంగన్వాడీ సెంటర్‌కి (Anganwadi Center) తాళం వేయడంతో టీచర్‌తో పాటు చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు ఎండలో నిల్చున్న సంఘటన తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కొహెడలో చోటు చేసుకుంది. సుమారు 30 మంది చిన్నారులు, 40 మంది గర్భిణీలు, బాలింతలు ఉన్న అంగన్వాడీ సెంటర్‌కు పొదుపు సంఘం మహిళలు తాళం వేయడంతో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధి కొహెడ అంగన్వాడీ సెంటర్-4ను గత కొన్నేండ్లుగా పొదుపు సంఘం భవనంలో కొనసాగిస్తున్నారు. అయితే ఈ నెల 27న పొదుపు సంఘంకు చెందిన మహిళలు అంగన్వాడి సెంటర్‌కు తాళం వేశారు.
అంగన్వాడి సెంటర్‌ను ఖాళీ చేయాలని అంగన్వాడీ టీచర్‌పై ఒత్తిడి తీసుకోని వచ్చి అంగన్వాడీ కేంద్రానికి తాళం వేశారు. దీంతో టీచర్ సుజాత సాయంత్రం వరకు అక్కడే వేచి ఉన్నప్పటికీ తాళాలు ఇవ్వకపోవడంతో చేసేది ఏమిలేక ఆమె అక్కడి నుంచి వెనుదిరిగారు. తిరిగి శనివారం ఉదయం చిన్నారులు, గర్భీణీలు, బాలింతలతో కలిసి అంగన్వాడీ సెంటర్ వద్దకు చేరుకొని తాళం తీయాలని కోరిన పోదుపు సంఘం మహిళలు తాళం తీయకపోవడంతో చేసేది ఏమి లేక కొహెడలోని ప్రాథమిక పాఠశాల భవనంలో చిన్నారులను, గర్భీణీలు, బాలింతలను కూర్చోపెట్టి పాఠశాలకు చెందిన ఆహారమే వారికి అందించారు. అంగన్వాడీ సెంటర్లోనే ఆహర పదార్థాలు ఉండిపోవడంతో చిన్నారులకు ఆహారం అందించ లేక ప్రభుత్వ పాఠశాల నుంచి ఆహారం తీసుకున్నట్లు టీచర్ సుజాత తెలిపారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకోని వెళ్లినట్లు చెప్పారు.
అంగన్వాడీ సెంటర్‌ను ఖాళీ చేయాలని పోదుపు సంఘం మహిళలు తాళం వేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి అన్నారు. అయితే పొదుపు సంఘం భవనంలో అంగన్వాడీ నిధులతో టాయిలెట్ నిర్మాణం చేపడుతుండడంతో పొదుపు సంఘం మహిళలు వ్యతిరేకించి అంగన్వాడీ సెంటర్‌కు తాళం వేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రాథమిక పాఠశాల భవనంలో ఒక గది అందుబాటులో ఉందని, దానికి మున్సిపాలిటి నుంచి పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేస్తామన్నారు. అందులోకి తరలించే వరకు పొదుపు సంఘం భవనంలో అంగన్వాడీ సెంటర్ కొనసాగుతుందని వెల్లడించారు.