Chiru-Balayya | టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి – బాలకృష్ణల మధ్య ఊహించని వివాదం రాజుకుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్లో చిరంజీవి పేరు ప్రస్తావన రావడంతో, అవి అభ్యంతరకరంగా మారాయి. దీనిపై చిరంజీవి ఘాటుగా స్పందించి సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు.ఈ ఘటనతో మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణపై పోలీస్ కేసు పెట్టాలని నిర్ణయానికి వచ్చారు. హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సమీపంలోని ఓ హోటల్లో అఖిల భారత చిరంజీవి యువత అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ఆంధ్రా, తెలంగాణ నుంచి వందలాది మంది మెగా అభిమానులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో 300కి పైగా పోలీస్ స్టేషన్లలో బాలకృష్ణపై ఫిర్యాదు చేయాలని తీర్మానించారు. ముందుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, తరువాత పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఇవ్వాలని భావించారు. అయితే విషయం చిరంజీవి దాకా వెళ్లింది. వెంటనే మెగాస్టార్ అభిమానులకు ఫోన్ చేసి ఆగమని సూచించారు. “అది మన సంస్కారం కాదు, కేసులు పెట్టడం సరైన మార్గం కాదు” అని వారించారు. చిరంజీవి మాటలతో మెగా అభిమానులు వెనక్కి తగ్గారు. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించిన అభిమాన సంఘ నాయకులు .. “మేము బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. మొదట కేసు పెట్టాలని నిర్ణయించుకున్నా, చిరంజీవి సూచనతో ఫిర్యాదు విరమించుకున్నాం. కానీ భవిష్యత్తులో ఎవరైన మెగాస్టార్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోం” అని స్పష్టం చేశారు.
మొత్తం మీద, మెగా – నందమూరి అభిమానుల మధ్య రగిలిన వివాదం, చిరంజీవి జోక్యం వల్ల మరింతగా ముదరకుండా ఆగిపోయింది. ఇక సినిమాల విషయానికి వస్తే చిరంజీవి ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ సంక్రాంతికి రానుంది. ఇందులో నయనతార కథాయికగా నటిస్తుండగా, చిత్రాన్ని అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. చిరు నటించిన మరో చిత్రం విశ్వంభర సమ్మర్లో రానుంది. ఇక బాలయ్య ప్రస్తుతం అఖండ 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీని డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.