ముంబై: మహారాష్ట్రను (Maharashtra) భారీ వర్షాలు (Heavy Rainfall) ముంచెత్తాయి. ముంబై, థాణె, మరఠ్వాడా ప్రాంతాలను కుండపోత వానలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నె ల 27 నుంచి 29 వరకు కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 11 మంది మరణించారు. సుమారు 41 వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సెప్టెంబర్ 29న నాందేడ్తోపాటు పలు ప్రాంతాల్లో ముగ్గురు వరదల్లో కొట్టుకుపోయారు. ఈనెల 28న నాశిక్, యావత్మాల్, జాల్నాలో ఇండ్లు కూలడంతోపాటు భారీ వరదలకు ఐదుగురు మృతిచెందారు. సెప్టెంబర్ 27న నాందేడ్, వార్ధాలో మరో ముగ్గురు చనిపోయారు.
ఇక సోలాపూర్, జాల్నా, ఛత్రపతి శంభాజీనగర్, ధారాశివ్ జిల్లాల్లో భారీ వర్షాలు దంచికొట్టాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 41 వేల మందిని తాత్కాలిక శిభిరాలకు తరలించారు. గత శనివారం ముంబైలో కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. పాల్ఘర్ జిల్లాలోని తలసారి ప్రాంతంలో అత్యధికంగా 208 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదయింది. అదేవిధంగా ఛత్రపతి శంభాజీ నగర్లో 120.8 మిల్లీమీటర్లు, 110.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది.