పాట్నా: బీహార్లో (Bihar) తుది ఓటరు జాబితాను (Voter List) కేంద్ర ఎన్నికల సంఘం (EC) మంగళవారం విడుదల చేయనుంది. అనేక వివాదాలకు దారితీసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను పూర్తి చేసిన ఈసీ ఫైనల్ లిస్టును ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. 22 ఏండ్ల తర్వాత ఇంత ముమ్మర స్థాయిలో ఓటరు జాబితా సవరణ నిర్వహించింది. దీంతో వచ్చే వారంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించే అవకాశముంది. అక్టోబరు చివరలో ఛట్ పండుగ తర్వాత తొలిదశ ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది. ఈనేపథ్యంలో అక్టోబర్ 4, 5 తేదీల్లో పట్నాలో ఎన్నికల సన్నద్ధతపై ఈసీ సమీక్ష జరుపనుంది.
కాగా, ఆగస్టు 1న విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో 7.24 కోట్ల ఓటర్లు ఉన్నారు. కోట్లలో ఓటర్లను తొలగించడంతో విపక్షాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. తుది జాబితాలో చట్ట విరుద్ధంగా ఏదైనా ఉంటే మొత్తం ఫైనల్ లిస్టును రద్దు చేస్తామని సుప్రీం కోర్టు ఈసీని హెచ్చరించింది. మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 12తో ముగియనుంది. గత అసెంబ్లీ ఎన్నికలు మూడు విడుతల్లో జరిగాయి. ఈ పర్యాయం కూడా అదే విధంగా ఎన్నికఉల నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తున్నది.