రంగారెడ్డి, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : జిల్లా పరిధిలోని శివారు ప్రాంతాలు డ్రగ్స్, గంజాయి వంటి నిషేధిత మాదక ద్రవ్యాలకు కేంద్రంగా మారాయి. శివారులోని హోటళ్లు, షాన్షాపులు, కిరాణా షాపుల్లో ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్ లభ్యమవుతున్నది. వీటిని తీసుకుని యు వత పెడ దారిపడుతున్నది. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకూ పాల్పడుతున్నది. కొందరు ఇంజినీరింగ్ విద్యార్థులు, ప్రైవేట్ హాస్టళ్లను లక్ష్యంగా చేసుకుని కొన్ని ముఠాలు డ్రగ్స్, గంజాయిని విక్రయిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, మహేశ్వరం, శంషాబాద్, కందుకూరు, రాజేంద్రనగర్, శంకర్పల్లి, మొయినాబాద్ వంటి ప్రాంతాల్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతున్నది. ఈ ప్రాం తాల్లో ఇంజినీరింగ్ కాలేజీలు అధికంగా ఉండడంతో వేలా ది హాస్టళ్లు ఏర్పాటయ్యాయి. ఈ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులను డ్రగ్స్, గంజాయికి అలవాటు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అలాగే, శివారు ప్రాంతాల్లోని రిసార్టుల్లోనూ జరిగే ఈవెంట్లకు నేరుగా గంజాయి, డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు.. ఇటీవల పలు రిసార్టుల్లో పోలీసులు జరిపిన దాడుల్లో తెట్టతేలమైంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోని యువత కూడా మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. మత్తులో జోగుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.
గంజాయి, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు యువత అలవాటు పడొద్దని పోలీసులు ఎక్కడికక్కడ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్ కళాశాలల్లోనూ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నా ఈ అక్రమ వ్యాపారం మాత్రం ఎక్కడ ఆగడంలేదు.
జిల్లా పరిధిలో విస్తరించి ఉన్న ఓఆర్ఆర్ను కేంద్రంగా చేసుకుని కొన్ని ముఠాలు గంజాయి, డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల నుంచి వచ్చే గంజాయిని జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిల్వ ఉంచి అక్కడి నుంచి గ్రామాలకు తరలిస్తున్నారు. ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జరిపిన దాడుల్లో అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద వేలాది కిలోల గంజాయి దొరికింది. అలాగే, హయత్‌నగర్, ఆదిబట్ల, రాజేంద్రనగర్, శంషాబాద్ వంటి ఠాణాల పరిధుల్లోనూ పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకుని పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇటీవల గంజాయిని తరలించే ముఠాలు పండ్ల పెట్టెలు, ఇతర వస్తువులను రవా ణా చేసే ప్యాకెట్లలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నా పక్కా సమాచారం మేరకు పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణా పరిధిలో నెల రోజుల వ్యవధిలో నాలుగు కేసులు, హయత్‌నగర్ ఠాణా పరిధిలో మూడు కేసులు, రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో రెండు కేసులు నమోదయ్యాయి. అలాగే, జిల్లాలోని పలు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులపైనా కేసులు నమోదయ్యాయి.
జిల్లాలోని పలు రిసార్టుల్లో బర్త్‌డేలు, ఇతరత్రా ఈవెంట్లకు గంజాయి ముఠాలు నేరుగా మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల పలు రిసార్టులపై పోలీసు లు దాడులు చేయగా.. అక్కడ గంజాయి లభించడంతో వారు విస్మయం వ్యక్తం చేశారు. తాజాగా శివారు ప్రాంతాల్లోని ఠాణాల పరిధుల్లోని రిసార్టుల యజమానులతో పోలీసులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రిసార్టుల్లో గంజాయి పట్టుబడితే నిర్వా హకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలను కట్టడి చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.