తుర్కయాంజాల్, మార్చి 10 : ఎండాకాలం వచ్చిందంటే నీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని ఆడబిడ్డల కన్నీటి కష్టాలను తీర్చింది. కలలో కూడా సాధ్యము కాదు అనుకున్న పనిని తన అకుంటిత దీక్షతో ఆయన పూర్తి చేసి తెలంగాణ ప్రజల పాలిట భగీరథుడయ్యాడు. ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి శుద్ధమైన మంచినీటిని అందిస్తున్నారు. భవిష్యత్ తరాలకు కూడా నీటి కష్టాలు రాకుండా పైపులైన్ పనులు, ట్యాంక్‌లను నిర్మించారు.
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ ప్రాంతంలో రెండు మూడు రోజులకోసారి నీటి సరఫరా ఉండేది. ఆ సరఫరా కూడా ఎంతసేపు ఉంటుందో తెలియక మహిళలు నల్లాల వద్ద పడిగాపులు కాసేవారు. అంతేగాక ఆనాడు నీటిని శుద్ధి చేయకపోవడంతో ప్రజలు ఆ నీటిని తాగి తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కునేవారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంటింటికీ శుద్ధ నీటిని అందించేందుకు రూ.96 కోట్లను మంజూరు చేశారు.
భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా పైపులైన్ వ్యవస్థ
నీటి సరఫరాకు సమస్యలు తలెత్తకుండా 31 ట్యాంక్‌ల ద్వారా మున్సిపాలిటీలోని ఇంటింటికీ నీటిని అందిస్తున్నారు. రాబోయే 40 సంవత్సరాల వరకు పెరుగనున్న జనాభాను కూడా దృష్టిలో ఉంచుకొని ట్యాంకుల నిర్మాణం, పైపులైన్ ఏర్పాటును అధికారులు పకడ్బందీగా చేస్తున్నారు. నీటి వృథాను అరికట్టేందుకు అధికారులు ప్రతి నల్లాకు మీటర్లు బిగిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి 500 లీటర్ల నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. లోతట్టు, ఎత్తైన ప్రాంతాల్లో కూడా సమానంగా నీరు అందజేస్తున్నారు.
నీటి కష్టాలు పూర్తిగా తీరాయి : అశ్విని, రాగన్నగూడ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా నీటి కష్టాలను తీర్చింది. గతంలో నీటి కోసం పబ్లిక్ నల్లాల వద్ద గంటల కొద్ది పడిగాపులు కాశాం. తుర్కయాంజాల్ మున్సిపాలిటీకి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మిషన్ భగీరథ పనుల కోసం నిధులను విడుదల చేసి ప్రజల కష్టాలను పూర్తిగా తొలగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం. ప్రతి కుటుంబానికి నీటిని అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
ఏండ్ల కల తీరింది : కొంతం సునీత, తుర్కయాంజాల్
కొన్నేండ్లుగా నీటి కోసం అనేక పాట్లు పడ్డాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నీటి కష్టాలు తీరాయి. సీఎం కేసీఆర్ ప్రజల మనసు ఎరిగి వారికి ఏమి కావాలో అడగకుండానే చేస్తున్నారు. మిషన్ భగీరథ పథకం ఎంతో మంచి పథకం. దీని ద్వారా మహిళలకు కష్టం పోయింది. ప్రతిరోజూ నీటి అవసరాల కోసం వీధి కూళాయిల వద్ద గొడవలు పడిన సంఘటనలు గతంలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఇంటి వద్దే నల్లా తిప్పితే నీళ్లు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు కేసీఆర్‌తోనే ఉంటారు.
ప్రజల కష్టాలు తీర్చడం మా బాధ్యత
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం
నియోజకవర్గంలోని ప్రజల కష్టాలను తీర్చడం ప్రభుత్వం బాధ్యతగా భావిస్తున్నది. ప్రజల మనసు ఉరిగిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండడంతో ప్రజలు కోరకుండానే రాష్ట్రంలో పథకాల అమలు జరుగుతున్నది. తుర్కయాంజాల్ మున్సిపాలిటీగా మారిన క్రమంలో నూతనంగా అనేక కాలనీలు పెరిగాయి. దీంతో జనాభా పెరిగి ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడ్డారు. ప్రజల నీటి కష్టాలను తీర్చాలనే ప్రధాన ఉద్దేశంతో మున్సిపాలిటీకి రూ.96 కోట్లు విడుదల చేసి పూర్తి స్థాయిలో మిషన్ భగీరథ పనులను పూర్తి చేశాం. ఇంటింటికీ నీటిని అందిస్తున్నాం.