న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ ; ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వేసవి కాలం ఆరంభంలోనే పల్లెల్లో తాగునీటి సమస్యలు మొదలయ్యాయి. బిందెడు నీటి కోసం కుళాయిల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్నారు. నీళ్లు దొరకక వ్యవసాయ బావులు, బోరుబావులను ఆశ్రయిస్తున్నారు. మిషన్ భగీరథ నీరు నాలుగైదు రోజులకోసారి వస్తున్నాయని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని రూపొందించి ప్రతి పల్లెకు తాగునీరు అందించారు. ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా కావడంలేదు. వేసవికాలం పూర్తిస్థాయిలో రాకముందే గ్రామాలు, తండాల్లో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాని ప్రజాప్రతినిధులు, అధికారులు తాగునీటి ఎద్దడి నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాగునీటి సమస్య పరిష్కరించండి
ఆమనగల్లు : మండలంలో నిత్యం ఏదో ఒక గ్రామంలో తాగునీరు సరఫరా కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ పైప్లైన్లు పగిలిపోవడంతో ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్య వెంటాడుతున్నది. మరికొన్ని గ్రామాల్లో రోజు విడిచి రోజు విడుతలవారీగా సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ అధికారుల ప్రణాళిక ప్రకారం.. ఆమనగల్లు మండల జనాభాకనుగుణంగా ప్రతి రోజూ 1.7 మిలియన్ లీటర్ల నీరు సరఫరా చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 1.6 మిలియన్ లీటర్ల నీరు సరఫరా అవుతున్నది. ఆమనగల్లు మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో సగం వార్డులకు ఒక రోజు.. సగం వార్డులకు మరో రోజు నీటిని సరఫరా చేయడంవల్ల ఆయా కాలనీల ప్రజలు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని వినియోగిస్తున్నారు. సంకటోని గ్రామంలో ఇటీవల ఐదు రోజులు తాగునీరు నిలిచిపోయింది. ప్రజలు అందోళన వ్యక్తం చేయడంతో నీటి సరఫరాను పునరుద్ధరించారు. మండలంలోని మంగళపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చెన్నకేశవ కాలనీలో మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలిపోయి పది రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. కాలనీవాసులు బోరు వ్యవసాయ బావుల వద్ద నీటిని తెచ్చుకుని కాలం వెళ్లదీస్తున్నారు. తాగునీరు సరఫరా చేయాలని కోరుతూ ఆందోళన చేయడంతో బోరు మోటరుకు మరమ్మతులు చేసి నీటిని వదులుతున్నారు. మండలంలోని కొత్తకుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని పాపర్లబోడ్తండా, మంగళికుంటతండా, మేడిగడ్డతండాలోని కొన్ని కాలనీలు, పోలేపల్లి తదితర గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొన్నది.
నాడు ఇంటికే నీరు..నేడు మారిన తీరు
కులకచర్ల : మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చాపల గూడెం గ్రామంలో తాగునీటి సమస్యతో మహిళలు ఇబ్బందులు పడుతూ తాగడానికి నీటిని వ్యవసాయ బోర్ల దగ్గరకు వెళ్లి తీసుకువస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. మిషన్ భగీరథ నీరు తమ గ్రామంలో సక్రమంగా రావడం లేదని, రెండు రోజులకు ఒకసారి వస్తున్నాయని.. ఒకటి రెండు బిందెలు మాత్రమే నిండుతున్నాయని తెలిపారు. గ్రామంలో తాగునీటి సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన బోర్లు సక్రమంగా పనిచేయక పోవడంతోనే తమకు తాగునీటి అవస్థలు వచ్చాయని మహిళలు పేర్కొంటున్నారు. తాగునీటి బోర్లు చెడిపోయినా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని, వేసవిలో నీటి కోసం ఎండలో వ్యవసాయ బోర్లను ఆశ్రయించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాగునీటికి కోసం అల్లాడుతున్న ప్రజలు
కడ్తాల్ : మండలంలోని రావిచేడ్ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు నాలుగైదు రోజులకోసారి సరఫరా చేస్తుడటంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. దీంతో గ్రామంలో ఇదివరకు ఏర్పాటు చేసిన బోరు వద్ద నీటి కోసం మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు భూగర్భ జలాలు అడుగంటడంతో గ్రామాల్లో బోర్లు సరిగ్గా పోయడంలేదు. నీళ్ల కరువు ఇంతలా ఎప్పుడు చూడలేదని మహిళలు వాపోతున్నారు. మహిళలు పడుతున్న బాధను అర్థం చేసుకొని మిషన్ భగీధథ పథకాన్ని ప్రవేశపెట్టి.. ఇంటింటికీ నీళ్లు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని మహిళలు అభిప్రాయపడుతున్నారు. మార్చి నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో నీటి సమస్య ఎలా ఉంటుందనే భయం ప్రజల్లో నెలకొన్నది.
తాగునీటి కోసం వ్యవసాయ బోర్ల దగ్గరకు వెళుతున్నాం
చాపలగూడెం గ్రామంలో తాగునీటి సదుపాయం సక్రమంగా లేదు. నీటి కోసం ప్రతి రోజూ ఇబ్బందులు తప్పడంలేదు. గ్రామంలో ఉన్న బోర్లు సక్రమంగా పనిచేయడంలేదు. దీంతో మేము వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నాం. వ్యవసాయ బోర్ల దగ్గరకు వెళ్లడానికి రోడ్డు దాటి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. మిషన్ భగీరథ నీళ్లు కూడా సక్రమంగా రావడంలేదు. వేసవిలో ప్రత్యేకించి తాగునీటి వసతిని కల్పించాలి. అసలే వేసవి కాలం.. దాహార్తిని తీర్చేందుకు తాగునీటి సమస్యను పరిష్కరించాలి.
– వెంకటమ్మ, చాపలగూడెం, కులకచర్ల మండలం
నాలుగైదు రోజులకోసారి నీళ్లు వస్తున్నాయి
గ్రామంలో తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నాం. మిషన్ భగీరథ నీళ్లు నాలుగైదు రోజులకోసారి వస్తుండటంతో చెప్పుకోలేని బాధలు పడుతున్నాం. కాలనీలోని బోరు వద్ద నుంచి ఇంటి వరకు బిందెలతో నీళ్లు తీసుకెళ్లాలంటే ఎండలో అవస్థలు పడుతున్నాం. అధికారులు వెంటనే స్పందించి మిషన్ భగీరథ నీటిని ప్రతిరోజూ సరఫరా చేసి ఇబ్బందులను తొలగించాలి.
– సుశీల, రావిచేడ్ గ్రామం, కడ్తాల్ మండలం
రోజూ మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలి
కాలనీలో ప్రతి రోజూ మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలి. సరఫరా సరిగా లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. వేసవికాలం ఆరంభంలోనే ఈ పరిస్థితులు ఏర్పడితే ఏప్రిల్, మే నెలల్ల్లో పరిస్థితి తీవ్రమయ్యే ప్రమాదముందని ఆందోళనగా ఉన్నది.
– కొమ్ము జెల్లమ్మ, గుర్రంగుట్టకాలనీ
మంచినీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నాం
గ్రామంలోని ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. నీటి సరఫరా సరిగ్గా లేకపోవడంతో కాలనీలో ఉన్న బోరు వద్ద నిరీక్షణ తప్పడంలేదు. ఒకవేళ కరెంట్ పోతే ఆ రోజంతా బోరు వద్ద నీటి కోసం పడిగాపులు కాయాల్సిందే. తాగునీటి కోసం పడుతున్న కష్టాలు పాత రోజులను గుర్తుకు తెస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికి నల్లాను ఏర్పాటు చేసి మంచినీటిని అందించింది. కానీ కాంగ్రెస్ పాలనలో నీటి కోసం అవస్థలు తప్పడంలేదు.
– రాణి, రావిచేడ్, కడ్తాల్ మండలం