Vikarabad | పెద్దేముల్, మే 3 : పెద్దేముల్ మండల పరిధిలోని పాషాపూర్ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. గ్రామంలో సుమారు 2000 మంది జనాభా ఉన్నారు. కానీ వారికి సరిపడా నీటి వనరులు మాత్రం లేవు. ఎన్నికల ముందు పాలకులు రావడం.. హమీలు ఇవ్వడం.. ఓట్లు వేయించుకోవడం తప్ప మా గ్రామానికి చేసిందేమి లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మా గ్రామానికి రెండు బోర్లు వేయిస్తానని మాట ఇచ్చారు. అదే విషయమై సంవత్సర కాలంగా ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్న వెనకాల ఉన్న నాయకులకు చెప్పడం తప్ప సమస్యను మాత్రం తీర్చడం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి సమస్య చెప్పుకోవడానికి వెళ్తే ఆయన వెంబడి ఉన్న నాయకులు ఇస్తాంలే రెండు రోజులు ఆగి రండి అని బొంకుతున్నారే తప్ప సమస్యను తీర్చే ప్రయత్నం మాత్రం చేయడం లేదు.
తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి రివ్యూ మీటింగ్‌లలో నియోజకవర్గంలో ఎక్కడ నీటి ఎద్దడి రాకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్టు పత్రికలలో రావడం తప్పా, క్షేత్ర స్థాయిలో అది అమలు కావడం లేదు. గ్రామ పంచాయతీ కార్యదర్శి తమకేమి పట్టనట్టు నిధులు లేవు మేమేమి చేయాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంతకు ఈ గ్రామంలో నెలకొన్న సమస్యను తీర్చే వారు ఎవరు? అసలు మా గ్రామం వారి దృష్టిలో ఉందో లేదో మేము మాత్రం ప్రతి రోజు తాగు నీటి కోసం యుద్దం చేయాల్సి వస్తుంది. ఒక్కరోజు గడిస్తే మళ్లీ రేపటి పరిస్థితి ఏంటన్న భయం నెలకొంటుంది. పొద్దున లేచి బైకులకు నాలుగు కడవలు తగిలించుకొని వ్యవసాయ క్షేత్రాలలో నీరు తెచ్చుకుంటు కాలం గడుతపున్నాం. చిన్నారులు సైతం నీటిని తోపుడు బండ్లు ద్వారా తేవాల్సి వస్తుంది. ఇక మహిళల పరిస్థితి కూడా అంతే. వ్యవసాయ బోర్ల మీద ఆధారపడి ఇంకా ఎన్ని రోజులు మాకు ఈ నీటి కష్టాలు, మా సమస్యను తీర్చే నాథుడే లేడా.? అని ఆ గ్రామస్థులు నాయకులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాయకులు ఎన్నికల ముందు ఓట్లు అడగడానికి వచ్చి హమీలు ఇచ్చి మోసం చేసి ఓట్లు వేయించుకుంటున్నారు తప్ప మా గ్రామంలో సమస్యను మాత్రం తీర్చడం లేదు. 2000 మంది జనాభ కలిగిన మా గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఎన్నికల ముందు రెండు బోర్లు వేయిస్తామన్నారు. ఇప్పటి వరకు వేయించలేదు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి మా గ్రామంలో నెలకొన్న నీటి సమస్య తీర్చాలని కోరుతున్నాం.
– అనిల్, పాషాపూర్ గ్రామం, పెద్దేముల్ మండలం
మా తండాలు అంటే అధికారులకు, నాయకులకు చులకనగా కనబడుతున్నాయి. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ నీళ్లు నిరంతరంగా రావడంతో నీటి సమస్య ఉండేది కాదు. ఇప్పుడ మిషన్ భగీరథ నీటి నిర్వాహణ సరిగా లేదు కాబట్టి మా గ్రామంలో నీటి సమస్య నెలకొంది. రెండు బోర్లు వేయిస్తామన్న నాయకులు సంవత్సరం గడుస్తున్న ఇటు వైపు కన్నెత్తి కూడ చూడడం లేదు. ఈ సమస్య ఇలాగే కొనసాగితే గ్రామస్థులమంతా కలిసి ఖాళీ బిందెలతో రోడ్డుపై భైఠాయించి ధర్నా చేస్తాం. అధికారులు వెంటనే స్పందించి ఇప్పటికైనా నీటి ససమస్య తీర్చాలని కోరుతున్నాం.
– రాములు నాయక్, పాషాపూర్ తండా, పెద్దేముల్ మండలం