ఇబ్రహీంపట్నం, జులై 19 : కాంగ్రెస్ వస్తే మళ్లీ నీటి కష్టాలు వస్తాయన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నిజమవుతోంది. గ్రామాల్లో గుక్కెడు తాగునీటి కోసం ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. మండల పరిధిలోని దండుమైలారం గ్రామంలో తాగునీరు రాక గత వారం రోజులుగా గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం ఏకంగా తాగునీటి బిందెలతో మహిళలు రోడ్లపైకి వచ్చి బోరుమోటార్ల వద్ద తాగునీటిని తెచ్చుకుంటున్నారు. మళ్లీ కాంగ్రెస్ పాలనలో తాగునీటి కష్టాలు వచ్చాయని, వారం రోజలుగా గ్రామానికి నీరు సక్రమంగా రావటం లేదని అధికారులకు విన్నవించినా పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. వర్షాకాలంలో కూడా గ్రామానికి సక్రమంగా నీరు అందించకపోవటం వెనుక అసమర్ధ కాంగ్రెస్ పాలనలో అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదని మహిళలు ఆరోపిస్తున్నారు. గ్రామానికి నీరు అందించకపోతే రోడ్లపై ఆందోళనలు నిర్వహిస్తామని దండుమైలారం గ్రామ మహిళలు అంటున్నారు.