ఫిబ్రవరి నెల నుంచే జిల్లాలో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో భూగర్భజలాలు అడుగంటుతున్నా యి. మిషన్ భగీరథ నీరు అంతంత మాత్రంగానే సరఫరా అవుతుండడం తో మహిళలు తాగునీటి కోసం రోడ్డెక్కుతున్నారు. కొన్ని గ్రామాల్లోని మహిళలు వ్యవసాయ బోర్ల వద్దకెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. రానున్న రోజు ల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా సమస్యను పరిష్కరించాల్సిన ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడుతున్నారు.
-వికారాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో తాగునీటి కష్టాలు మళ్లీ మొదలయ్యా యి. బీఆర్ఎస్ హయాంలో పదేండ్లపాటు ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందగ.. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడంతో మళ్లీ పాత రోజులు వస్తున్నాయి. కిలోమీటర్ల మేర దూరంలో ఉన్న బోరుబావుల వద్దకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొన్నది. గత నెల రోజులుగా జిల్లాలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండల తీవ్రత పెరుగడంతో ఓ వైపు భూగర్భజలాలు అడుగంటగా.. మిషన్ భగీరథ నీరు అంతంత మాత్రంగానే సరఫరా అవుతుండడంతో సమస్య పరిష్కరించాలంటూ ప్రజలు రోడ్డెక్కుతున్నారు.
ఫిబ్రవరి మొదటి వారం నుంచే జిల్లాలో తాగునీటి సమస్య నెలకొన్నది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఇలాకాలోనూ తాగునీటి కోసం తండాలవాసులు రోడ్డెక్కి ధర్నా చేయడం గమనార్హం. మరోవైపు ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో మిషన్ భగీరథ నీరు ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. గ్రామాల్లో మిషన్ భగీరథ నీటిని వారానికి ఒక్క రోజు వదులుతున్నట్లు, మరికొన్ని ఊర్లలో ఆ నీటి సరఫరా కాకపోవడంతో ప్రజలు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బోర్ల వద్దకెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. మున్సిపాలిటీల్లోనూ మిషన్ భగీరథ నీటిని మూడు, నాలుగు రోజులకోసారి వదులుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు.
ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. రానున్న ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నదని మండిపడుతున్నారు.
మళ్లీ యాక్షన్ ప్లాన్లు..
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జాడలేని సమ్మర్ యాక్షన్ ప్లాన్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గతేడాది నుంచి మళ్లీ షురూ అయ్యాయి. ప్రజలు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితికి కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకంతో చెక్ పెట్టింది. ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీటిని అందించింది. మరోవైపు జిల్లాలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ఫిబ్రవరి మొదటి వా రం నుంచే ఓ వైపు చలితోపాటు ఎండ తీవ్ర త కూడా పెరుగడంతో భూగర్భజలాలు క్రమంగా తగ్గినట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి రెండు మీటర్ల మేర నీటి నిల్వలు తగ్గాయి. గతేడాది ఫిబ్రవరిలో 12 మీటర్ల లో తులో భూగర్భజలాలుండగా, ఈ ఫి బ్రవరి నాటికి 13.58 మీటర్ల లోతుకు నీటి నిల్వలు తగ్గిపోయాయి. రానున్న ఏప్రి ల్, మే వరకు జిల్లాలో భూగర్భజలా లు ప్రమాదకర స్థాయిలో తగ్గే ప్రమాదం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని మెజార్టీ చెరువుల్లో నీటి నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి.
ఇంటింటికీ నల్లాల ద్వారా నీటి సరఫరా..
గత కేసీఆర్ ప్రభుత్వం రూ. కోట్లు ఖర్చు చేసి ఎక్కడో ఉన్న శ్రీశైలం నుంచి తాగునీటిని తీసుకొచ్చి ప్రజల దాహార్తిని తీర్చింది. ‘మిషన్ భగీరథ’తో ఇంటి వద్దకే నీరు వచ్చింది. ఈ పథకంలో భాగంగా జిల్లాకు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తాగు నీరందించారు. 230 కిలోమీటర్ల దూరంలోని కొల్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోస్తూ రాఘవాపూర్, కొడంగల్‌లోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు సరఫరా చేశారు. ఇందుకోసం రూ.1,070 కోట్లతో ప్రధాన పైపులైన్లు, ఓహెచ్‌బీఆర్‌లు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం, రూ. 413 కోట్లతో ఇంట్రా విలేజ్ పనులు పూర్తి చేసి తాగునీటిని అందించారు. అయితే, వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని 971 ఆవాసాలకు, 1,98,162 కుటుంబాలకు ఇంటింటికీ నల్లాల ద్వారా భగీరథ నీరు సరఫరా జరిగింది.