Maheshwaram | బడంగ్పేట్, మార్చి 15 : మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని చాలా ప్రాంతాలలో నీటి కటకట మొదలయ్యింది. గతంలో మిషన్ భగీరథ ద్వారా గ్రామాలలో, కాలనీలలో నీటి సరఫరా సజావుగా జరిగేది. ఎక్కడ కూడా ప్రజలు బిందెలతో, డ్రమ్ములతో నీళ్ల కోసం పడిగాపులు కాసేవారు కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని కుర్మల్‌గూడ, మల్లాపూర్, నాదర్‌గూల్, గుర్రంగూడా పరిధిలోని పలు కాలనీలలో, జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని షాహిన్ నగర్, వాదే ముస్తఫా, పహాడీ షరీఫ్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నంది హిల్స్, రాఘవేంద్ర కాలనీ, కమలానగర్ ఇతర ప్రాంతాలలో నీటి సమస్య ఉంది. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అధికారులు సరఫరా చేసే నీళ్ళు క్షేత్రస్థాయి వరకు వెళ్లడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
పేదలు నివాసముండే కాలనీలలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. కుర్మల్ గూడలో నీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆటోలలో డ్రమ్మును పెట్టి నీళ్లు దొరికే ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. బోర్లు ఉన్న వాళ్లను బతిమాలుకొని డ్రమ్ములలో నీటిని పట్టుకొని పోతున్నారు. 15 రోజులకోసారి వచ్చే మంచినీళ్ల కోసం మహిళలు నీటి యుద్ధాలే చేస్తున్నారు. గత 15 సంవత్సరాల నీటి సమస్య మరోసారి పునరావృత్తం అయినట్లు కనిపిస్తుంది. బిందెలతో మహిళలు ఘర్షణ పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అధికారులు మాత్రం పైనుంచి నీటి సరఫరా సరిగా లేదని మెసేజ్‌లు పెడుతున్నారు.
మార్చి మాసంలోనే నీటి సమస్య ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలో నీటి కష్టాలు తారాస్థాయికి చేరి ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వేసిన బోర్లన్నీ ఎండిపోయాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం రోజు ముష్టి యుద్ధాలు చేయవలసి వస్తుందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 15, 20 రోజులకోసారి వచ్చే మంచినీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తుందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుడేమో గాని నీళ్లన్న ఇవ్వండి బాబోయ్ అని జనం గోడు వెళ్ళబోసుకుంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల తీరుతో జనం మండిపడుతున్నారు. కనీసం కొత్తగా బోర్లు వేసి నీటి సరఫరా చేయాలని వివిధ కాలనీలకు చెందిన ప్రజలు కోరుతున్నారు. మా గొంతులు ఎండుతున్నాయని, మా గోడు వినాలని ఎవరికి చెప్పిన పట్టించుకోవడంలేదని అన్నారు. నీటి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధమవుతామని కాలనీల అసోసియేషన్ నాయకులు సైతం హెచ్చరిస్తున్నారు.
బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్ గూడలో నీటి సమస్య ఉన్న మాట వాస్తవమే. కాలనీవాసులు ఇప్పటికే ఈ సమస్యను నా దృష్టికి తీసుకువచ్చారు. బోర్లు వేయించాలని ఫిర్యాదు చేశారు. ఇప్పటికే అక్కడ చాలా బోర్లు వేసాము. మరో మూడు బోర్లు వేయించడానికి ప్లాన్ చేస్తున్నాము. వాటర్ వర్క్ అధికారులతో మాట్లాడుతున్నాము. వేసవికాలంలో నీటి సమస్య రాకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నాము. చాలా చోట్ల నీటి సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. దశలవాదిగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము. అయినా సమస్యలు వస్తూనే ఉన్నాయి.
కుర్మల్ గూడలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. నీటి కోసం రోజు ప్రజలు ఘర్షణ పడుతున్నారు. గతంలో మిషన్ భగీరథ నీళ్లు సరిపోను వచ్చేవి. ప్రస్తుతం నీళ్లు రావడం లేదు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డ్రమ్ములు ఆటోలలో పెట్టుకుని ఇతర ప్రాంతాల నుంచి నీటిని తీసుకొని రావడం జరుగుతుంది. ప్రభుత్వం స్పందించడం లేదు. అసలే వేసవికాలం నీటి సమస్య జఠిలంగా మారింది. ప్రతిరోజు నీటి కోసం జనం బారులు తీరుతున్నారు. ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. ఎన్నిసార్లు ఎవరికీ ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల దాహార్తిని తీర్చండి.
15 రోజులకోసారి కూడా నీళ్లు రావడం లేదు. ఎవరినో ఒక్కర్ని అడుక్కొని డ్రమ్ములలో నీళ్లు తీసుకువస్తున్నాం. మంచినీళ్లు ఇవ్వకపోయినా సరే కానీ వాడుకోవడానికి బోరు నీళ్లు అన్న ఇవ్వాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా గోడు ఎవరు వినడం లేదు. నీటి సమస్య రోజురోజుకు పెరిగిపోతుంది. బోర్లు ఉన్న వాళ్ళ ఇండ్లలో పోయి నీళ్లు అడుక్కోవలసి వస్తుంది. ప్రభుత్వం మా కష్టాలు పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ ఓటు వేయడం మాకు శాపమైంది. నీటి సమస్యను పరిష్కరించండి. మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడండి. లేదంటే కాలి బిందెలతో ఆందోళన చేపడతాం.
– సుజాత, స్థానికురాలు