యాచారం, మే 3 : గింజా కొనలే అనే శీర్షికన నమస్తే తెలంగాణలో శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మండలంలోని యాచారం, నంది వనపర్తి గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఆర్డీఏ డీపీఎంలు నరసింహ, విలాస్రావ్లు పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్న తీరును ఏపీఎం సాంబశివుడు, సిబ్బంది, నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదిలేదని మందలించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో యాచారం, నందివనపర్తి, చింతపట్ల గ్రామాలలో ఐకేపీ మహిళల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. రైతులకు ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2320, బీ గ్రేడ్ ధాన్యంకు రూ.2300ల మద్దతు ధరను చెల్లిస్తున్నట్లు తెలిపారు. రూ.500ల బోనస్‌ను అందించనున్నట్లు తెలిపారు. రైతులు16-17 శాతం తేమ వచ్చేటట్లు ఎటువంటి తేడా లేకుండా ఉన్న వడ్లను మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. తేమ శాతం అధికంగా ఉంటే కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన తరువాత తూకం వేయించాలని సూచించారు. ఇప్పటి వరకు చింతపట్ల, నంది వనపర్తి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు 19 మంది రైతులు ధాన్యం తీసుకు రాగా, తేమ శాతం 16 ఉన్న ఒకే ఒక్క రైతు వద్ద నుంచి 48 క్వింటాళ్ల వడ్లు మాత్రమే కొనుగోలు చేసినట్లు తెలిపారు. తేమ శాతం తక్కువగా ఉండేలా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని వారు రైతులకు సూచించారు. లేదంటే కొనుగోళ్లకు అనుమతి లేదని వారు సూచించారు. కొనుగోలు కేంద్రలను పక్కాగా నిర్వహించాలని ఆధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీసీలు గణేష్, నరసింహ, అశోక్, స్వరూప, శ్రీహరి తదితరులున్నారు.