కారాబాద్, ఏప్రిల్ 16 : పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు బాధాకరం, ఆయన తెలివితక్కువతనానికి నిదర్శనమని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్, భారత్ విభజనతో పోల్చడం సరికాదని మండిపడ్డారు.
రాజ్యాంగానికి అనుగుణంగా, పార్లమెంట్ ఆమోదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మీకు తెలియదా తేజస్వీ అని ప్రశ్నించారు. తెలిసి ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యటం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన లేమితో ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సైతం సమర్థించడం సిగ్గుచేటన్నారు. రాంచందర్రావు వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, తేజస్వీ సూర్య వ్యాఖ్యలకు బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.