వికారాబాద్, జనవరి 10, (నమస్తే తెలంగాణ): ఐకేపీ సభ్యులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకుగాను ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతీ సీజన్లో క్వింటాలుకు కొంత కమీషన్ డబ్బులను ఐకేపీ సభ్యులకు ప్రభుత్వం చెల్లిస్తూ వస్తున్నది. ధాన్యాన్ని కొనుగోలు చేసినందుకుగాను ఐకేపీ సభ్యులకు అందాల్సిన కమీషన్ డబ్బులను నొక్కేసిండు ఓ అవినీతి అధికారి. బొంరాస్‌పేట మండలం బూరాన్పూర్లో ఐకేపీ ఆధ్వర్యంలో గత ఐదారేండ్లుగా ధాన్యాన్ని సేకరిస్తున్నారు. ధాన్యాన్ని సేకరించినందుకుగాను సంబంధిత గ్రామ సంఘం బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులు జమ అవుతూ వస్తున్నాయి.
సంబంధిత కమీషన్ డబ్బులను ఐకేపీ సభ్యులకు వీవో బ్యాంకు ఖాతా నుంచి విత్‌డ్రా చేసి అందజేయాల్సి ఉంటుంది. కానీ గ్రామ సంఘం బ్యాంకు ఖాతాలో ఒకేసారి భారీ మొత్తంలో కమీషన్ డబ్బులు ఉండడంతో రూ.10 లక్షలకుపైగా కమీషన్ డబ్బులను నొక్కేశారు. విలేజ్ బుక్ కీపర్‌తో చేతులు కలిపి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వీరయ్య గ్రామ సంఘం బ్యాంకు ఖాతా నుంచి ఐకేపీ సభ్యులకు సమాచారం లేకుండానే మరొకరి ఖాతాకు మళ్లించారు. డీపీఎం వీరయ్య భార్య సుజాత బ్యాంకు ఖాతాలోకి రూ.2 లక్షలు, రూ.2.13 లక్షలను రెండు సార్లు, మరో రూ.6 లక్షలను ముంబైలో ఉంటున్న బిచ్చయ్య బ్యాంకు ఖాతాలో జమ చేశారు. తదనంతరం బిచ్చయ్య ఖాతా నుంచి వీబీకే ఖాతాకు డబ్బులు మళ్లించారు.
గ్రామ సంఘం ఖాతాకు సంబంధించి సంబంధిత సంఘం సభ్యులు బ్యాంకుకు వెళ్లగా కమీషన్ డబ్బులు ఖాతా నుంచి మాయమైన విషయం తెలియడంతో బూరాన్పూర్ స్వయం సహాయక సంఘాల సభ్యులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. గత నెలలోనే డీఆర్డీవో కృష్ణన్ దృష్టికి బురాన్‌పూర్ గ్రామ సంఘం సభ్యులు జరిగిన మోసాన్ని తెలుపగా, ఎలాంటి విచారణకు ఆదేశించకపోగా కమీషన్ డబ్బులను నొక్కేసిన అధికారికి మద్దతుగా వ్యవహరించినట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. నెల రోజులైనా ఎవరూ పట్టించుకోకపోవడంతో గత ప్రజావాణిలో బురాన్‌పూర్ గ్రామ సంఘం సభ్యులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఐకేపీ సభ్యులకు అందాల్సిన కమీషన్ డబ్బులను నొక్కేసిన ఉదంతంపై పూర్తి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అదనపు కలెక్టర్‌ను కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు.
గ్రామ సంఘానికి సంబంధించిన ఏ సమాచారాన్ని అడిగినా బుక్ కీపర్ మహిళలకు ఇవ్వడం లేదు. ధాన్యం కమీషన్ ఎంత వచ్చింది, డబ్బులు ఎక్కడ ఉన్నాయని అడిగితే తెలుపలేదు. కమీషన్ డబ్బులు దుర్వినియోగం అయ్యాయని తెలుసుకుని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. అధికారులు విచారణ చేసి న్యాయం చేయాలి.
-మాటూరి పద్మమ్మ, మహిళా సంఘం సభ్యురాలు, బురాన్‌పూర్
ధాన్యం కొనుగోలు చేపట్టగా గ్రామ సంఘానికి వచ్చిన కమీషన్ డబ్బుల గురించి బుక్ కీపర్, ఓబీలను అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదు. దీంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. వచ్చిన కమీషన్ డబ్బులు ఎక్కడున్నాయో లెక్కలు చేద్దాం రండి అని బుక్ కీపర్‌ను, ఓబీలను పిలిస్తే రావడం లేదు. ఓబీలు, బుక్ కీపర్ కలిసి కమీషన్ డబ్బులను దుర్వినియోగం చేశారు. ఉన్నతాధికారులు ఈ విషయమై విచారణ చేయాలి.
-కిష్టపురం సత్యమ్మ, సంఘం సభ్యురాలు, బురాన్‌పూర్