సిటీబ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, అస్పష్టమైన ఆలోచనలు, వివాదస్పదమైన హైడ్రా లాంటి నిర్ణయాలు, పేదల నడ్డి విరిచేలా అమలు చేసిన ప్రకటనలతో నింగిలో ఉండే రియల్ ఎస్టేట్ చుక్క నేలరాలింది. ఏ గడియలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో తెలియదు కానీ తమ పరిస్థితి అత్యంత దయనీయమైనంగా మారిందని, నెత్తినోరు మోదుకొవాల్సిన దుస్థితి వచ్చిందని రియల్ వ్యాపారులు వాపోతున్నారు. వ్యాపారుల దీనవస్థలకు అద్దం పట్టేలా నగరంలో హైదరాబాద్ రియల్ ట్రెండ్‌పై వస్తున్న నివేదికలు కూడా అదే విధంగా వాస్తవాలను చూపుతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం ‘లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చాం. విస్తృతంగా కొత్త కంపెనీలు వస్తున్నాయి. ఊహకందని తీరుగా తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. ఫ్యూచర్ సిటీ పేరిట కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు, విస్తృతమైన వ్యాపార అవకాశాలు’ అంటూ ఊదరగొడుతున్నది. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం రియల్ ఎస్టేట్ రంగానికి కాంగ్రెస్ పాలన ఓ పీడకలలా మారిందనే అభిప్రాయం అన్నివర్గాల్లో వ్యక్తమవుతున్నది. తాజాగా ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ వెల్లడించిన నివేదిక హైదరాబాద్ నగరంలో ఏకంగా 49 శాతం మేర ఇండ్ల అమ్మకాలు పడిపోయాయని, దేశంలోనే అన్ని మెట్రో నగరాల కంటే హైదరాబాదే అట్టడుగున ఉందని తేల్చింది.
2009-12 సమయంలోనూ ఇదే తీరుగా రియల్ ఎస్టేట్ సంక్షోభంలో కూరుకుపోతే… తెలంగాణ ఏర్పాటుతో బీఆర్ఎస్ సర్కారు జీవం పోసింది. కొన ఊపిరీతో ఉన్న తెలంగాణను ప్రణాళికాబద్ధమైన విధానాలతో అభివృద్ధి చేస్తూ… హైదరాబాద్ కేంద్రంగా ఎకరం వంద కోట్లకు విక్రయించుకునే స్థాయికి తీసుకెళ్లింది. గడిచిన పదేండ్లలో హైదరాబాద్ కేంద్రంగా సాగిన రియల్ ట్రెండ్‌తో… విదేశీ సంస్థలు సైతం లక్షల కోట్ల పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. అలా దేశంలో ఏ మెట్రో నగరంలో లేనట్లుగా అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ నగరంలో తమ కార్పొరేట్ కార్యాలయాలను ప్రారంభించుకునే వేదికను చేసుకున్నాయి. కానీ 2023 డిసెంబర్లో రేవంత్ ముఖ్యమంత్రి పగ్గాలు తీసుకోవడంతో మంచు ముద్దలా రియల్ ఎస్టేట్ ఆశలన్నీ నీరుగారిపోతూనే ఉన్నాయి.
ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రాధాన్యతనివ్వడంతో పెట్టుబడిదారుల విశ్వసనీయత పెరిగింది. దీంతో హైదరాబాద్ కేంద్రంగా వచ్చే 15-20 ఏళ్ల పాటు మార్కెట్‌కు ఢోకా లేకుండా దూసుకుపోయింది. నగరానికి మణిహారం లాంటి ఓఆర్ఆర్ దాటి రియల్ కార్యాకలాపాలు విస్తరించాయి. ముఖ్యంగా సిటీ నలుమూలాల ప్రభుత్వం చేపట్టిన ఎన్నో విప్లవాత్మక మార్పులతో హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ జాతీయ స్థాయిలో ఘనమైన చరిత్రను సొంతం చేసుకున్నది. ప్రభుత్వం నిర్వహించిన భూముల వేలానికి కూడా అనూహ్య స్పందన రావడంతో ఎకరం వంద కోట్లకు విక్రయించే స్థాయికి ఎదిగింది. ఇంత గొప్ప స్థాయికి ఎదిగిన హైదరాబాద్ రియల్ వైభవం కాస్తా ఏడాదిన్నర కాలంగా మసకబారుతూనే ఉంది. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత, కుట్రపూరిత నిర్ణయాలేనని రియల్ వర్గాలు బహిరంగంగానే ప్రకటిస్తున్నాయి. గర రియల్ ఎస్టేట్ రంగానికి ఆయువుపట్టు లాంటి ఇంటి నిర్మాణ రంగం హైడ్రా దెబ్బకు కోలుకోలేని పరిస్థితిలో ఉంది.
దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో మోస్తరు స్థాయిలో ఉందని ప్రముఖ నిర్మాణ రంగ అధ్యయన సంస్థ అనరాక్ వెల్లడించింది. హైదరాబాద్‌లో మాత్రం అమ్మకాలు 49శాతం పడిపోతాయని తేల్చింది. తొలి త్రైమాసికంలో జరిగిన అమ్మకాలపై నివేదికను రూపొందించగా… గతేడాదిలో పోల్చితే 9వేల యూనిట్ల అమ్మకాలు తగ్గే అవకాశం కనిపిస్తుందని పేర్కొంది. గతేడాది మొదటి త్రైమాసికంలో 19660 యూనిట్ల నుంచి 10వేల యూనిట్లకు పడిపోతుందని వెల్లడించింది. మిగిలిన మెట్రో నగరాల కంటే హైదరాబాద్‌లోనే దారుణంగా అమ్మకాలు పడిపోతాయని అంచనా వేయడం కలవరపెడుతోంది. ప్రాప్‌ఈక్విటీ సంస్థ వెల్లడించిన నివేదికలోనూ 47శాతం మేర అమ్మకాలు పడిపోగా అన్ని మెట్రో నగరాల కంటే దారుణంగా హైదరాబాద్ మార్కెట్ ఉందని తేల్చింది.
కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే మొదలైన రియల్ ఎస్టేట్ అమ్మకాల క్షీణత.. 2009-12 మధ్యన ఎదురైన ఆర్థిక సంక్షోభం కంటే దారుణంగా అమ్మకాలు పడిపోయాయి నివేదికలు చెబుతున్నాయి. ఈ రియల్ సంక్షోభం కేవలం గృహా నిర్మాణాలకే పరిమితం కాకుండా, ఆఫీస్ స్పేస్ అమ్మకాలోనూ ఉందని మరో నివేదికలో పేర్కొంది. ఐటీ కారిడార్ కేంద్రంగా పుష్కలంగా అందుబాటులో ఆఫీస్ స్పేస్‌కు కూడా డిమాండ్ లేదని నివేదికలు వెల్లడించాయి. ఈ లెక్కన కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న పెట్టుబడుల ప్రవాహాన్ని కూడా అనుమానించాల్సిన పరిస్థితి నెలకొంది.