తాండూర్, జూలై 12: తాండూరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (KGBV) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ విషయంలో అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దని ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సల్వాజి మహేందర్ రావు సూచించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పారదర్శకంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులకు అభ్యర్థుల నుంచి పోటీ ఎక్కువగా ఉండడంతో అభ్యర్థుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని ఇప్పటికే కొందరు దళారులు డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
అధికారులు, పెద్ద నాయకులతో మాట్లాడి మీకే ఉద్యోగం వచ్చేటట్టు చేస్తానని మాయమాటలు చెబుతూ వాళ్లను ప్రలోభాల గురిచేస్తున్నారని చెప్పారు. ఆశావహులు వారి మాటలు నమ్మి డబ్బులు సమర్పించుకుంటున్నారని తెలిపారు. మెరిట్ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే మెరిట్ జాబితాను అధికారులు ప్రదర్శించారని వెల్లడించారు. ఈ పోస్టుల భర్తీ విషయంలో ఎలాంటి పైరవీలకు తావు లేదని చెప్పారు. దళారుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.