కొడంగల్, జూన్ 20 : స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో టీబీ పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని సద్వినియోగం చేసుకొని, టీబీని నిర్మూలిద్దామని డా. బుష్రా పేర్కొన్నారు. శుక్రవారం టీబీ ముక్త్ భరత్ అభియాన్లోని 100 రోజుల ప్రణాళిక భాగంగా పట్టణంలోని వడ్డర్ గల్లీవీధి లో టీబి, షుగర్, బిపి వంటి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెండు వారాలకు మించి అధిక దగ్గు, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, రాత్రుల్లో చెమట పట్టడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతో పాటు వైద్య సేవలు అందుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా గతంలో టీబీ వ్యాధి బారిన పడ్డ వారి కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేసినట్లు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన హెల్త్ క్యాంపులో మొత్తం 110 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 30 మందిని గుర్తించి తెమడా, ఎక్సరే పరీక్షలు చేసినట్లు తెలిపారు. వీరిలో వ్యాధి నిర్ధారణ జరిగితే వారికీ 6 నెలల పాటు ఉచితంగా మందులు పంపిణి చేయడంతో పాటు పౌష్టిక ఆహారం కూడా అందించడం జరుగుతుందన్నారు. కావున నిర్లక్ష్యం చేయకుండా విధిగా వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంఎల్హెచ్పీ డా. అమృత, హెల్త్ ఆసిస్టెంట్ మధుసూదన్ రెడ్డి, టీబి సూపర్ వైసర్ రాహత్ అలీ, ఏఎన్ఎం చంద్రకళ తోపాటు ఆశా కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.