పెద్దేముల్, మార్చి 1 : గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలకు హాజరై కంటి పరీక్షలు చేయించుకుంటున్న ప్రజల్లో 30% మందికి ఉచితంగా కంటి అద్దాలు అందేలా వైద్య సిబ్బంది చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ పాల్వన్ కుమార్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని కందనెల్లిలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని, సబ్‌సెంటర్, స్థానిక పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటి వెలుగు శిబిరాల్లో ఎంతమంది ప్రజలకు కంటి పరీక్షలు చేస్తున్నామన్నది ముఖ్యం కాదని, ఎంత కచ్చితత్వంతో, ఎంత నాణ్యతతో కంటి పరీక్షలు చేస్తున్నామన్నేదే చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
వైద్య సిబ్బంది కలెక్టర్ ఆదేశాలమేరకు సమయానుసారంగా జియో అటెండెన్స్‌ను తప్పకుండా విధిగా నమోదు చేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి నెలలో ఏఎన్సీ, ఇమ్యూనైజేషన్, సంజీవని తదితర వైద్య సేవల్లో 100% అన్ని రకాలుగా పూర్తి చేసి జిల్లాలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఐదో స్థానంలో నిలువడం సంతోషకరమన్నారు. పీహెచ్సీ పరిసరాలను పరిశీలించి పీహెచ్సీలో పనిచేసే వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన ఆదేశించారు. వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా సమయానుసారంగా క్రమశిక్షణతో పనిచేస్తూ వైద్యశాఖకు, పీహెచ్‌సీకి మంచి పేరు ప్రతిష్టను తీసుకురావాలని ఆయన సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ బుచ్చిబాబు ఉన్నారు.