రంగారెడ్డి, మే 24 (నమస్తే తెలంగాణ) : వానకాలం పంటల సాగుకు సన్నద్ధమవుతున్న జిల్లా రైతాంగానికి పరిస్థితులు అనుకూలంగా కనబడడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నప్పటికీ జిల్లాలో ఇప్పటికీ భారీ వానలు పడలేదు.
గత ఏడాది జూన్ మాసం నుంచి సైతం అంతంత మాత్రమే వర్షాలు కురిశాయి. ఫలితంగా యాసంగి సాగులో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుత మే నెలలోనూ సాధారణ వర్షపాతమే నమోదైంది. దీంతో జూన్‌లో కురిసే భారీ వర్షాలపైనే రైతాంగం ఆశలు పెట్టుకున్నది. ఆతర్వాతే పరిస్థితులను అంచనా వేసుకుని పంటలను సాగు చేసే యోచనలో జిల్లా రైతాంగం ఉంది.
ప్రస్తుత వానకాలంలో జిల్లాలో 4.45లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. వరి 1,38,187 ఎకరాల్లో, జొన్న 3,361 ఎకరాల్లో, మొక్క జొన్న 66,530 ఎకరాల్లో, పెసర్లు 48 ఎకరాల్లో, కందులు 11,548 ఎకరాల్లో, మినుములు 34 ఎకరాల్లో, వేరు శనగ 550 ఎకరాల్లో, ఆముదం 37 ఎకరాల్లో, మరో 48,959 ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేసే అవకాశం ఉన్నది.
అత్యధికంగా ఈ సీజన్లో పత్తిని 1,76,174 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ చెబుతున్నది. సీజన్‌కు ముందు జిల్లాలో కురుస్తున్న వర్షాలు రైతుల్లో ఆశలను రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే రైతులు పంటల సాగుకు భూములను సిద్ధం చేసి ఉంచారు. విత్తనాలు, ఎరువులను సైతం సమకూర్చుకున్నారు. వర్షాలు కురిస్తే.. విత్తనం వేద్దామని వేచి చూస్తున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అరకొరగా కురుస్తున్న వర్షాలతో రైతులు విత్తనాలు వేయడానికి కొంతమేర వెనుకంజ వేస్తున్నారు.
గత ఏడాది వానకాలం నుంచి నేటి వరకూ జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. గత ఏడాది జూన్ నెల నుంచి ప్రస్తుత మే నెల వరకు 717.4మి.మీ.ల వర్షపాతం కురువాల్సి ఉండగా.. 719..0మి.మీ.లు మాత్రమే కురిసింది. అంటే 0.2 శాతం మాత్రమే అధిక వర్షం పడింది. ఇక ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 63.0మి.మీ.ల వర్షం మాత్రమే కురిసి 64.6మి.మీ.ల లోటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో 6 మండలాల్లోనే సాధారణానికి మించి ఆశించిన మేరలో వర్షాలు పడ్డాయి.
16 మండలాల్లో సాధారణ వర్షపాతమే పడగా.. బాలాపూర్, అబ్దుల్లాపూర్‌మెట్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, శంషాబాద్ మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే రానున్న రోజుల్లో సమృద్ధిగా వర్షాలు పడుతాయని, రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేనప్పటికీ.. జూన్‌లో అధికంగానే కురుస్తాయని వారు పేర్కొంటున్నారు. అదును చూసి జూన్, జూలై వరకు కూడా విత్తనాలు నాటుకోవచ్చునని వారు సూచిస్తున్నారు.