రంగారెడ్డి, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : బాలల హకులను అందరూ పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని బాలల రక్షణకై అన్ని శాఖల సమన్వయం అవసరమని అన్నారు. బాలకార్మికులు, బాల్య వివాహాలు, అక్రమ రవాణా, మిస్సింగ్ వంటి సమస్యలతో బాధపడే 18 సంవత్సరాల లోపు పిల్లలకు రక్షణ కల్పించడం కోసం అందరూ సహకరించాలని సూచించారు. చట్టాలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని పేరొన్నారు.
బాల్య వివాహాల నిరోధానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. బడీడు పిల్లలందరూ బడికి వెళ్లేలా చూడాలన్నారు. సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పిల్లల సమస్యలను తెలుసుకొని పరిషరించాలని సూచించారు. బాల కార్మిక వ్యవస్థ, దత్తత, పిల్లల లైంగిక నేరాలు, మత్తు పదార్థాల నియంత్రణ తదితర అంశాలపై కమిటీ సభ్యులతో చర్చించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి పద్మజా రమణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, పీడీ డీఆర్డీఏ శ్రీలత, డీపీవో సురేశ్మోహన్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రామేశ్వరి దేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.