మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తున్నది. ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేయడంతో పాటు చేపల వేటకు సంబంధించిన సామగ్రి, ద్విచక్ర, టాటా ఏస్ వాహనాలను అందించి బతుకుపై భరోసా కల్పించింది. ఈ ఏడాది ఇప్పటికే తొలి విడుత చేప విత్తనాలను పంపిణీ చేయగా, నేటి నుంచి మలి విడుత చేప పిల్లల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. జిల్లావ్యాప్తంగా కోటీ 67 లక్షల చేప పిల్లలను పంపిణీ చేయడమే లక్ష్యం కాగా, ముందుగా కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని ఆమనగల్లు, మాడ్గుల, కడ్తాల్, తలకొండపల్లి మండలాల్లో బొచ్చె, రొహు, బంగారు తీగ, మోసు తదితర చేప విత్తనాలను పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ నాలుగు మండలాల్లోని 101 చెరువులు, కుంటల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 20 లక్షల 60 వేల చేప పిల్లలను పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మున్ముందుగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నందుకు ఈ మండలాల్లోని 15 మత్స్యకార సొసైటీల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– రంగారెడ్డి, నవంబర్ 18(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం పలు సామాజిక వర్గాలను అక్కున చేర్చుకుంటూ, వారి ఆర్థికపరమైన ఎదుగుదలకు కృషి చేస్తున్నది. అందులో భాగంగా మత్స్యకార సొసైటీలకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. చేపపిల్లల పంపిణీ, వచ్చే దిగుబడి నేపథ్యంలో ప్రభుత్వానికి పైసా ప్రయోజనం లేకపోయినా వారి బతుకులకు భరోసాను, భద్రతను కల్పిస్తున్నది. గత ఎనిమిదేండ్లుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియను అధికార యంత్రాంగం జిల్లాలో మరోమారు చేపట్టనున్నారు. కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో నేటి (శనివారం) నుంచి ఈ కార్యక్రమాన్ని జిల్లా మత్స్య శాఖ విభాగం, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించనుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో 120 మైనర్ ఇరిగేషన్ చెరువులు, 674 చెరువులు మత్స్య శాఖ ఆధీనంలో 6,422 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి. గత సంవత్సరం (2021-2022) 100% గ్రాంట్స్‌పై కోటీ72లక్షల చేపపిల్లలను నీటి వనరుల్లో వదిలేందుకు మత్స్య శాఖ లక్ష్యంగా పెట్టుకోగా.. 794 చెరువుల్లో కోటీ63లక్షలకు పైగా చేపపిల్లలను వదిలింది. 2022 – 2023 సంవత్సరానికి కోటీ67లక్షల చేప పిల్లలను ఆయా నీటి వనరుల్లో వదిలేందుకు అధికార యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్నది. తొలి విడుతలో భాగంగా ఇప్పటికే 205 చెరువుల్లో 60 లక్షల చేప పిల్లలను వదిలింది. ఇక మలి విడుతలో భాగంగా శనివారం నుంచి ముందుగా ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్ మండలాల్లో చేపపిల్లలను పంపిణీ చేయనుంది. 20లక్షల60వేల చేపపిల్లల పంపిణీకి అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది.
నేటి నుంచి నాలుగు మండలాల్లో..
జిల్లా (కల్వకుర్తి నియోజకవర్గం) పరిధిలో ఉన్న నాలుగు మండలాల్లో నేటి నుంచి పంపిణీ కొనసాగనుంది. ఆమనగల్లు మండలంలో 13 గ్రామ పంచాయతీలు, ఒక మత్స్యకార సొసైటీ ఉంది. చెరువులు, కుంటలు కలుపుకొని 18 ఉన్నాయి. 2లక్షల60వేల చేప పిల్లలను పంపిణీ చేయనున్నారు. మాడ్గుల మండలంలో 33 గ్రామపంచాయతీలు, నాలుగు మత్స్యకార సొసైటీలున్నాయి. చెరువులు, కుంటలు కలుపుకొని 15 ఉన్నాయి. 2లక్షల చేపపిల్లలను పంపిణీ చేయనున్నారు. కడ్తాల్ మండలంలో 24 గ్రామపంచాయతీలు, 4 మత్స్యకార సొసైటీలున్నాయి. చేపత చెరువులు, కుంటలు కలుపుకొని 42 ఉన్నాయి. 7 లక్షల చేపపిల్లలను పంపిణీ చేయనున్నారు. తలకొండపల్లి మండలంలో 32 గ్రామపంచాయతీలు, 6 మత్స్యకార సొసైటీలున్నాయి. చెరువులు-18, కుంటలు-8 ఉన్నాయి. 9 లక్షల చేపపిల్లలను పంపిణీ చేయనున్నారు. నాలుగు మండలాల్లోని 102 గ్రామపంచాయతీలు, 15 మత్స్యకార సొసైటీల ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది.
వివిధ రకాల చేపపిల్లలు..
ప్రస్తుతం జిల్లాలోని 101 చెరువుల్లో వేసేందుకు చేపపిల్లలను ఆంధ్ర ప్రాంతం నుంచి తెప్పించారు. 35-40 మి.మీ, 80-100 మి.మీ ఉన్న చేపపిల్లలను పంపిణీ చేయనున్నారు. బొచ్చ, రొహు, బంగారు తీగ, మోసు లాంటి చేపపిల్లలను పంపిణీ చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. ఈ నాలుగు మండలాల అనంతరం ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగనుంది. జిల్లాలోని మిగతా చెరువుల్లోనూ కొనసాగుతుందని జిల్లా అధికారి చెప్పారు. కోటీ67లక్షల చేపపిల్లలను పంపిణీ చేసేందుకు, 100% టార్గెట్‌ను పూర్తి చేసేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఇందుకు జిల్లా అధికారులు ప్రణాళికా చర్యలను చేపట్టారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం చేయూత : ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
టీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తులు, చేతివృత్తులను ప్రోత్సహించేందుకు పలు సంక్షేమ పథకాలను అమలులోకి తెచ్చింది. వివిధ సామాజిక వర్గాలను ప్రగతి పథంలోకి తీసుకొచ్చేందుకు ఫెడరేషన్స్ పనిచేస్తున్నాయి. కుంటలు, చెరువులు, రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మత్స్యకారుల సొసైటీలకు ప్రభుత్వం వలలు, మోపెడ్లు, ఫోర్ వీలర్లను వారి సంక్షేమం నిమిత్తం అందజేస్తున్నది. చేపల ఎదుగుదలకు చెరువుల్లో వేసేందుకు దాణాను కూడా అందజేస్తున్నది. మత్స్యకారులు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకొని అభివృద్ధిలోకి రావాలి.
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : ఏ.సుకీర్తి, జిల్లా మత్స్య శాఖ అధికారి
మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నది. ఈ సదుపాయాన్ని మత్స్యకార సొసైటీ ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదుగాలి. జిల్లాలో 121 మత్స్యకారుల సంఘాలున్నాయి. వారి ఆధ్వర్యంలోనే చేపపిల్లల పంపిణీ కొనసాగుతుంది. సర్పంచ్‌లు, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆయా సొసైటీల సభ్యులు చేపపిల్లల గణనను జాగ్రత్తగా చేపట్టాలి. వివిధ రకాల చేపపిల్లలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది.