కొడంగల్, అక్టోబర్ 31: ప్రజల చైతన్యంతోనే తెలంగాణ అభివృద్ధి ఆధారపడి ఉందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గం మద్దూర్ మండలంలోని పెదిరిపాడు, చెన్నారెడ్డిపల్లి, మోమినాపూర్ తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి మంగళవారం రాత్రి వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్‌ను నమ్ముకుంటే వ్యవసాయానికి 3 గంటల కరెంటు మాత్రమే మిగులతుందని, కేసీఆర్‌తో 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరాతో పండుగలా వ్యవసాయం చేసుకునే ఆస్కారం ఉంటుందన్నారు.
పంట పెట్టుబడితో పాటు కుటుంబానికి భరోసాగా రైతుబీమా వంటి సదుపాయాలను కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్‌కు తగ్గట్టుగా పిట్టకథలు చెప్పే రేవంత్ తోడైయ్యాడని, కాంగ్రెస్ 6 గ్యారెంటీలు చెల్లుబాటు అయ్యే ప్రసక్తి లేదన్నారు. కర్ణాటకలో కూడా గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రజలను కాంగ్రెస్ నమ్మబలికిందని, నేడు కన్నడ ప్రజలు కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమానికి పాటుపడుతుంటే.. కాంగ్రెస్ ప్రజాసంక్షమ పథకాలను అమలు కాకుండా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు అందించిందన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉందని, సీఎం కేసీఆర్ కొడంగల్ నియోజవకర్గ అభివృద్ధికి వందల కోట్ల నిధులు మంజూరుతో ప్రతి గ్రామానికి రోడ్డు, తాగునీరు వంటి ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి వచ్చినట్లు గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో వచ్చే కాంగ్రెస్ నాయకులకు ప్రజలో బుద్ధి చెప్పాలని కోరారు. ఓటమి భయంతో నియోకవర్గంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులను కొనుగోళ్లు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని, డబ్బుకు అమ్ముడుపోయే వారికి ప్రజలే బుద్ది చెప్పాలన్నారు. బీఆర్ఎస్కు మరో మారు అవకాశాన్ని కల్పిస్తే మరింత అభివృద్ధి చేసి ప్రజాసేవకు అంకితమౌతానని హామీ ఇచ్చారు. అభివృద్ధిని ఆకాంక్షించి గ్రామ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీలో చేరుతుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులు మోసపూరితమైన మాయా జాలంలో పడవద్దని, ఎన్నికల సమయంలోనే సమన్వయంతో కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.