ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. ముఖ్యంగా బీటీ, మెటల్ రోడ్లు, ఫార్మేషన్ రోడ్లపై నీరు నిలిచి మోకాళ్లలోతు గోతులు ఏర్పడటంతో వాహనాలు నడిచే పరిస్థితి కూడా లేకుండా పోయింది. రోడ్లపై నిలిచిన నీటిలోనే ఇటీవల పలు గ్రామాల్లో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ వరినాట్లు కూడా వేశారు. అయినప్పటికీ ప్రభుత్వం రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించడంలేదు. దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులపై స్థానిక శాసనసభ్యులు, ఇన్చార్జి మంత్రులు గాని ఇప్పటివరకు అధికారులతో సమీక్ష కూడా నిర్వహించలేదు. రోడ్ల దుస్థితి అధ్వానంగా మారినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా రోడ్లన్నీ కంకర తేలి, గుంతలు పడి, వర్షం నీరు నిలిచి బురదమయంగా ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లు కుంగిపోయాయి. గ్రామాల్లోని రోడ్లు గుంతలుగా ఉండడంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు జంకుతున్నారు. వాహనదారులు ఇబ్బంది పడుతున్నా మరమ్మతులపై పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 21 నెలలు పూర్తైనా ఒక్క రూపాయి కూడా రోడ్ల అభివృద్ధికి ఖర్చు చేయకపోవడం గమనార్హం.
రంగారెడ్డి, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 4వేల పైచిలుకు కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు, 2వేల కిలోమీటర్లకు పైగా ఆర్అండ్బీ రోడ్లు ఉన్నాయి. 200 వరకు పంచాయతీరాజ్ రోడ్లు ఉండగా.. 300 వరకు ఆర్అండ్బీ రోడ్లు ఉన్నాయి. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు, కొత్తూరు, కేశంపేట, చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి, మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ వంటి ప్రాంతాల్లో రోడ్లు ప్రధానంగా దెబ్బతిన్నాయి. వర్షపునీరు రోడ్లపైనే నిలువగా.. బీటీ రోడ్లు సైతం గోతులు పడి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. ప్రమాదకరంగా మారిన వంతెనల విషయంలో కూడా ప్రభుత్వం దృష్టి సారించడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల వర్షాలకు రోడ్లపై నుంచి వాగులు పొంగిపొర్లుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలూ నిలిచిపోయాయి.
ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో పూర్తిగా దెబ్బతిన్న రోడ్ల సత్వర మరమ్మతుల కోసం అధికారులు రూ.23.84 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రతిపాదనలు పంపినప్పటికీ ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా రాకపోవడం గమనార్హం. ఇటీవల కురిసిన వర్షాలకు కొత్తూరు మండలంలో 2, మొయినాబాద్‌లో 2, కొందుర్గులో 4, షాబాద్‌లో 4, కేశంపేటలో 2, మహేశ్వరంలో 1, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో 1 రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటికి వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులు నిర్ణయించారు. కాని, ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. పలు గ్రామాలకు రోడ్లు పూర్తిగా దెబ్బతినడం వలన ఆర్టీసీ బస్సులు కూడా నడవలేని పరిస్థితి ఏర్పడింది.
జిల్లాలో అత్యంత ప్రమాదకరమైన పలు వంతెల నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను కూడా కేటాయించింది. కాని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులున్న వాటికి కూడా పనులు చేపట్టడం లేదని ఆరోపణలున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని లష్కర్‌గూడ-అబ్దుల్లాపూర్‌మెట్ మధ్య వంతెన అత్యంత ప్రమాదకరంగా మారింది. గతంలో కురిసిన వర్షాలతొ ఈ వంతెన నుంచి భారీ వరద రావడంతో వరదలో చిక్కుకుని ఓ కారు కొట్టుకుపోయి ఇద్దరు వ్యక్తులు కూడా మృతిచెందారు. ఈ వంతెన నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.15కోట్ల నిధులు కూడా కేటాయించింది. అలాగే, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని మజీద్‌పూర్ సమీపంలో ఉన్న వంతెన కూడా అత్యంత ప్రమాదకరంగా మారింది. రెండు రోజుల పాటు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ వంతెన నిర్మాణానికి కూడా నిధులున్నప్పటికీ పనులు ముందుకు సాగటంలేదు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ వద్ద సాగర్ రహదారిపై నిర్మించిన వంతెన కూడా అసంపూర్తిగా నిలిచిపోయింది. కొందుర్గు మండలంలోని రేగడిచిల్కమర్రి-రామచంద్రాపూర్ రహదారి గుంతలమయంగా మారింది. ఏమాత్రం అజాగ్రత్త వహించినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించగా ఒకవైపు వంతెన కూడా పూర్తయ్యింది. మరోవైపు ఇప్పటి వరకు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. దీంతో ఈ వంతెన సమీపంలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్ల మరమ్మతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
వికారాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాలో రోడ్లు అధ్వానంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రం పరిధిలోని వికారాబాద్-హైదరాబాద్ వెళ్లే దారి గతుకులమయంగా మారింది. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ అంతటా రోడ్లు అధ్వానంగా మారాయి. ఈ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. కొన్ని తండాలు, గ్రామాలకు వెళ్లే రోడ్లు కొట్టుకుపోవడంతో వాహనాలు వదిలేసి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. నవాబుపేట సమీపంలో రోడ్డు మరీ ఘోరంగా తయారైంది. రోడ్డు అంతా కొట్టుకుపోగా కేవలం కంకరరాళ్లు, గుంతలే మిగిలాయి. స్థానిక ఎమ్మెల్యేకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు. నవాబుపేటతోపాటు ఎక్మామిడి వద్ద అడుగుకో గుంత ఏర్పడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్-మోమిన్‌పేట వెళ్లే రహదారి, మోమిన్‌పేట్-మర్పల్లి రోడ్డు, వికారాబాద్-కోట్‌పల్లి రోడ్డు, బొంరాస్‌పేట నుంచి గ్రామాలకు వెళ్లే రోడ్లు, దౌల్తాబాద్ మండలంలోని రోడ్లు, తాండూరు-పెద్దేముల్ వెళ్లే రోడ్లు, మోమిన్‌పేట-శంకర్పల్లి వెళ్లే రోడ్డు, నవాబుపేట మండల కేంద్రంలోని రోడ్లన్నీ పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో ద్విచక్రవాహనాలపై వెళ్లేవారికి ప్రమాదాలు జరుగుతున్నాయి. దోమ మండలంలోని అయినాపూర్, పూడూరు మండలం చన్గోముల్-మన్నెగూడ రోడ్డు అయితే మరీ అధ్వానంగా తయారైంది. వికారాబాద్ నుంచి నస్కల్ మీదుగా పరిగి రహదారిలో మద్గుల్ చిట్టంపల్లి వాగు బ్రిడ్జితోపాటు పరిగి సమీపంలోని వాగుపై ఉన్న బ్రిడ్జిలు గుంతలు పడి ప్రమాదకరంగా మారాయి. భారీ వరద వస్తే బ్రిడ్జిలు పూర్తిగా కొట్టుకుపోయే పరిస్థితి నెలకొన్నది.
వికారాబాద్ : సీఎం సొంత జిల్లా, స్పీకర్ ప్రాతినిథ్యం వహిస్తున్న వికారాబాద్ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఇటీవల మర్పల్లి మండలం కల్కొడ వద్ద ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో బంట్వారం వెళ్తుండగా రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడి ఇరుక్కుపోయింది.
వికారాబాద్ మండలం పులుసుమామిడి గ్రామం నుంచి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సొంత గ్రామం చించల్‌పేటకు వెళ్లే దారిలో రోడ్లు పూర్తిగా గుంతలు పడింది. వికారాబాద్ నుంచి నస్కల్ పరిగి వెళ్లే దారిలో మద్గుల్ చిట్టంపల్లి వద్ద బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో ప్రమాదం పొంచి ఉందని ఆర్అండ్బీ అధికారులు తాత్కాలికంగా బారికేడ్లు, కర్రలు ఏర్పాటు చేశారు. వికారాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డుపై ప్రమాదపుటంచున ప్రయాణం చేయాల్సి వస్తున్నది. వికారాబాద్ నుంచి జైదుపల్లి వెళ్లే దారిలో కల్వర్టు నిర్మాణ పనులు నత్తనడకలా సాగుతుండటంతో కురిసిన వర్షానికి కల్వర్టు పక్క నుంచి వస్తున్న ఒక టిప్పర్ ఇరుక్కుపోయి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
ధారూరు మండలం కోట్‌పల్లి ప్రాజెక్టు నిండి అలుగు పారుతుండటంతో నాగసముందర్ రోడ్డుపై నీరు ఉధృతంగా పారి రోడ్డు పాక్షికంగా దెబ్బతిన్నది. దోర్నాల్ నుంచి అంపల్లికి వెళ్లే బీటీ రోడ్డులో పెద్ద గుంత ఏర్పడగా రెండు రోజులపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానిక నాయకుడి చొరవతో గుంతను పూడ్చి మరమ్మతులు చేశారు. చినుకు పడితే చాలు మండల కేంద్రంలోని బస్టాండ్ చిత్తడిగా మారిపోతున్నది. వికారాబాద్, తాండూరు డిపోకు చెందిన బస్సులు బస్టాండ్‌లోకి రావడం లేదు. రోడ్డుపైనే బస్సులు నిలుపడంతో వాహనదారులు, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదు.
బంట్వారం నుంచి రొంపల్లి పీడబ్ల్యూడీ రోడ్డు, బంట్వారం నుంచి యాచారం చౌరస్తా వరకు రోడ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కోట్‌పల్లి నుంచి మోత్కుపల్లి, కోట్‌పల్లి నుంచి పెద్దేముల్ ప్రధాన రహదారి పూర్తిగా పాడై వర్షపు నీరు నిలిచి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కోట్‌పల్లి నుంచి మర్పల్లి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది.
మర్పల్లి మండలం కల్కోడ నుంచి తొర్మామిడి వెళ్లే రోడ్డులో వికారాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కల గుంతలో ఇరుక్కుపోయింది. అదే రోడ్డులో కల్వర్టు తెగిపోయి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. మర్పల్లి నుంచి మోమిన్‌పేట వెళ్లే రోడ్డులో కల్వర్టు సమీపంలో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి.
నవాబుపేట మండలంలోని గంగ్యాడ, గొల్లగూడ, ఎల్లకొండ, పులుమామిడి, లింగంపల్లి, చించల్‌పేట, చిట్టిగిద్ద, నవాబుపేట, ముబారక్పూర్, గుబ్బడి ఫతేపూర్ గ్రామాలకు వెళ్లే రోడ్లపూ పూర్తిగా పాడైపోయాయి. ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లు వెళ్లాలంటే నరకం అనుభవించక తప్పడంలేదు.
మోమిన్‌పేట నుంచి మండల కేంద్రంలోని మైతాబ్‌ఖాన్‌గూడ వరకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. మోమిన్‌పేట నుంచి ఆయా గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్లు పూర్తిగా పాడైపోయాయి.
తాండూరు : తాండూరు-హైదరాబాద్, తాండూరు-చించొల్లి, తాండూరు-పెద్దేముల్, తాండూరు-మహబూబ్‌నగర్ రోడ్లు ఎన్నో రోజులుగా పనులు నడిచినప్పటికీ సకాలంలో పూర్తి కాకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. సీఎం సొంత జిల్లాలో కూడా రోడ్లు అధ్వానంగా ఉండటంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
పరిగి : రాఘవాపూర్-నంచర్ల రహదారిలో బాస్పల్లి-గొడుగోనిపల్లి మధ్య, దోమ మండలం గంజిపల్లి వాగు., పరిగి-వికారాబాద్ మధ్య పరిగి సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పూడూరు మండలంలోని పలు గ్రామాల గుండా ప్రవహించే ఈసీ వాగుతో పంట పొలాలు కొట్టుకుపోయాయి. ప్రధానంగా రాఘవాపూర్-నంచర్ల రహదారిలో బాస్పల్లి-గొడుగోనిపల్లి గ్రామాల సమీపంలో వాగుల వద్ద రోడ్డు దెబ్బతిన్నది. ఐనాపూర్ రహదారి సైతం బాగా దెబ్బతిని గుంతలమయంగా మారింది. గంజిపల్లి వాగు సమీపంలో సైతం దెబ్బతిన్నది. ముజాహిద్పూర్ రోడ్డులో సైతం గూడూరు వాగు వద్ద రహదారికి నష్టం కలిగింది. చిట్టెంపల్లి-లాల్‌పహడ్ రహదారిలో, చన్గోముల్, నిజాంపేట్, మేడిపల్లి సమీపంలో రహదారి దెబ్బతినడంతో గుంతలమయంగా మారింది. సుల్తాన్పూర్-దోమ-బాస్పల్లి రహదారిలో బాస్పల్లి వాగు వద్ద రహదారి పాడైపోయింది. ఆర్అండ్బీ రోడ్లకు సంబంధించి సబ్ డివిజన్ పరిధిలో సుమారు 15 కిలోమీటర్ల మేరకు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారుల గణాంకాలే చెబుతున్నాయి. పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి పరిగి మండలంలో మూడు రహదారులో సుమారు 3.15 కిలోమీటర్లు, పూడూరు మండలంలో రెండు రహదారుల్లో 1.6 కిలోమీటర్లు, కులకచర్ల మండలంలో 3 రహదారుల్లో సుమారు 2 కిలోమీటర్లు, దోమ, చౌడాపూర్ మండలాల్లో 6 రహదారులలో సుమారు 3.8 కిలోమీటర్ల మేరకు రహదారులు బాగా దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పరిగి మండలం మాదారం నుంచి పూడూరు మండలం సిరిగాయపల్లికి వెళ్లేందుకు రైతులు, ఓ విద్యుత్ సంస్థ వారు వేసిన పైపులతో కూడిన రహదారి భారీ వరదకు కొట్టుకుపోయింది.