రంగారెడ్డి, మే 31 (నమస్తే తెలంగాణ) : సన్నాలు పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటిస్తున్నప్పటికీ బోనస్ చెల్లింపులో మాత్రం ప్రభుత్వం రైతులకు మొండిచేయి చూపిస్తున్నది. ఈ సీజన్లో కూడా సన్నరకం పండించిన అన్నదాతలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని చెప్తున్నప్పటికీ సర్కారు ప్రకటనను రైతులు నమ్మడంలేదు. గతేడాది రంగారెడ్డి జిల్లాలో యాసంగి, వర్షాకాలంలో సన్నరకం పండించిన అన్నదాతలు కొనుగోలు కేంద్రాల్లో సుమారు పదివేల క్వింటాళ్ల వరకు ధాన్యాన్ని విక్రయించారు.
కాని, వారికి రావాల్సిన బోనస్ మాత్రం ఇప్పటివరకు అందలేదు. ఈ ధాన్యానికిగానూ క్వింటాల్‌కు 500 బోనస్ కింద రైతులకు సుమారు జిల్లావ్యాప్తంగా రూ.7కోట్ల బకాయిలున్నాయి. వర్షాకాలం సీజన్లో కూడా జిల్లావ్యాప్తంగా 26వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో సుమారు ఆరు నుంచి ఎనిమిదివేల మెట్రిక్ టన్నుల వరకు సన్నరకం వడ్లను సర్కారు కొనుగోలు చేసింది. ఇందులో కూడా సగం మంది అన్నదాతలకే బోనస్ డబ్బులందాయని.. మిగతావారికి ఇవ్వలేదని వాపోతున్నారు.
బకాయిలు రూ.10 కోట్లకు పైగా..
ప్రతిఏటా సర్కారు సన్నరకం వరిధాన్యం పండించిన అన్నదాతలకు బోనస్ ఇస్తామని చెప్తున్నప్పటికీ చెల్లింపులు మాత్రం చేపట్టడంలేదు. దీంతో సన్నరకం వరిధాన్యం పండించిన రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావడంలేదు. అన్నదాతలు పండించిన సన్నరకం వరిధాన్యాన్ని వారే ఎండబెట్టి రైస్‌మిల్లుల్లో పట్టించి బియ్యం విక్రయిస్తున్నారు. మరికొంతమంది రైతులు తక్కువ ధరలకే మధ్య దళారులకు విక్రయిస్తున్నారు. దీంతో సర్కారు హామీ నిలబెట్టుకోవడంలేదని అన్నదాతలు వాపోతున్నారు.
ఏటా వరిసాగులో పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ సర్కారు ఇచ్చే మద్దతు ధరతోపాటు బోనస్ డబ్బులు కూడా ఇస్తే గిట్టుబాటు ధర వస్తుందని ఆశించిన రైతులకు నిరాశ మిగిలింది. గతేడాది యాసంగి, వర్షాకాలం సీజన్లలో అన్నదాతల నుంచి కొనుగోలు చేసిన సన్నరకం వడ్లకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు పదికోట్లకు పైనే ఉన్నాయి. యాసంగిలో సన్నరకం ధాన్యం విక్రయించిన రైతులకు ఏ ఒక్కరికీ బోనస్ ఇవ్వలేదు. వర్షాకాలం సీజన్లో కూడా సగం మందికి మాత్రమే బోనస్ చెల్లించినట్లు అన్నదాతలు తెలిపారు. ఈ సీజన్లో కూడా బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్తున్నా రైతుల్లో మాత్రం భరోసా లేదు. దీంతో అన్నదాతలు సన్నరకం వరిధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు బదులు బయట మార్కెట్లో విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ సీజన్లో కొనుగోలు కేంద్రాలకు సన్న వరి ధాన్యాన్ని రైతులు తీసుకురావడంలేదు.