రంగారెడ్డి, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ప్రజా అవసరాలు, ఫ్యూచర్‌సిటీ, గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుల నిర్మాణానికి ఇప్పటివరకు అసైన్డ్, ప్రభుత్వ భూములను సేకరించిన ప్రభుత్వం ఇప్పుడు పట్టా భూములపై గురిపెట్టింది. అయితే పరిహారం విషయం తేల్చకుండానే ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీచేయటంపై రైతులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే యాచారం మండలంలోని పలు గ్రామాల్లో రైతుల అంగీకారం లేకుండానే ప్రభుత్వం పట్టా భూములను సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేయడంతో.. సంబంధిత రైతులు తమ పట్టా భూములను సర్కార్‌కు ఇచ్చేది లేదంటూ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఆ భూములపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించినా..సంబంధిత భూములకు పరిహారాన్ని అథారిటీలో జమచేసిన సర్కార్.. రైతుల పేర్లను రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించి టీజీఐఐసీ పేరున బదలాయించడంతోపాటు ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చింది. పట్టా భూములు సేకరించే క్రమంలో రైతుల అంగీకారం తప్పనిసరి అయినా ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా పలు కంపెనీల ఏర్పాటు కోసం తీసుకుంటున్నట్టు నోటిఫికేషన్లు జారీచేసింది. ఇప్పటికే కందుకూరు, యాచారం, మహేశ్వరం, కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి, షాబాద్, మొయినాబాద్, చేవెళ్ల వంటి మండలాల్లో పట్టా భూముల సేకరణకోసం సర్కార్ నోటిఫికేషన్లు జారీ చేయడంతో రైతులు ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ ప్రాణాలు పోయినా పట్టా భూములు ఇచ్చేది లేదంటూ భూసేకరణకు వచ్చే అధికారులకు బాధిత రైతులు తేల్చి చెబుతున్నారు. గత బుధవారం ముచ్చర్ల గ్రామంలో పట్టాభూముల సేకరణను వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి అధికారులను అడ్డుకున్నారు. అలాగే, శంషాబాద్ మండలంలోని నర్కూడ తదితర గ్రామాల్లో పట్టాభూముల సేకరణను రైతులు అడ్డుకున్నారు. అలాగే, గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు భూసేకరణ విషయంలోనూ పట్టా భూములను ఇచ్చేందుక రైతులు సిద్ధంగా లేకున్నా ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేస్తున్నది.
జిల్లాలో ప్రభుత్వ భూముల బలవంతపు సేకరణలో పరిహారాన్ని ప్రభుత్వం తేల్చటంలేదు. భూములు కోల్పోతున్న రైతుల్లో కొందరు తాము అనుకున్న మేరకు పరిహారం ఇస్తేనే భూములి స్తామని చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం రైతుల డిమాండ్ మేరకు పరిహారం ఇచ్చేందుకు ససేమిరా అంటున్నది. భూముల ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా మూడింత లు ఎక్కువచేసి పరిహారం ఇస్తామని చెబుతున్నా మార్కెట్ విలువ కాకుండా ఓపెన్ మార్కెట్లో ఈ భూముల ధర లు కోట్ల రూపాయల పైనే ఉన్నాయి. బయటి మార్కెట్లో ఉన్న డిమాండ్ ఆధారంగా ఎకరాకు రూ.కోటి నుంచి రూ.2కోట్ల వరకు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తుండగా.. అంత మొత్తాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయటంలేదు.
కందుకూరు మండలంలోని ముచ్చర్ల గ్రామంలో ప్రభుత్వం 300 ఎకరాల పట్టా భూములను తీసుకుంటున్నట్టు గత నాలుగురోజుల కిందట నోటిఫికేషన్ జారీచేసింది. రైతులను సంప్రదించకుండానే వారి అంగీకారం లేకుండానే నోటిఫికేషన్ జారీ చేయడంపై రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తూ అధికారులను అడ్డుకున్నారు. గ్రీన్‌ఫార్మాసిటీ ఏర్పాటు పేరుతో ముచ్చర్లలో పలు సర్వేనంబర్లలో ఉన్న 300 ఎకరాల పట్టా భూములను తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, రైతులు భూములిచ్చేది లేదంటూ తెగేసి చెప్తున్నారు.
యాచారం మండలంలోని మేడిపల్లి, కుర్మిద్ద, తాటిపర్తి, నానక్‌నగర్ గ్రామాల్లో పట్టా భూములను ప్రజా అవసరాల పేరుతో తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ భూములనూ రైతుల అంగీకారం లేకుండానే నోటిఫికేషన్ జారీచేసింది. సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మేడిపల్లిలో 483 ఎకరాలు, నానక్నగరలో 154, తాటిపర్తిలో 382, కుర్మిద్దలో 974ఎకరాలు సుమారు 900 మంది రైతుల నుంచి పట్టా భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములకు సంబంధించి ప్రభుత్వం రాత్రికి రాత్రే అవార్డులను పాస్‌చేసి ఎకరాకు రూ.8 లక్షల చొప్పున రూ. 176 కోట్ల పరిహారాన్ని అథారిటీలో జమచేసింది. కానీ, రైతులు ఈ పరిహారాన్ని తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో సర్కార్ రైతుల పేర్లను రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించి బలవంతంగా టీజీఐఐసీ పేరున భూములను బదలాయించింది. ఈ పరిహారం తమకు సరిపోదని, తాము భూములిచ్చేది లేదని రైతులు చెప్తున్నారు.